టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రేపు (ఆదివారం) భోగి వేడుకల్లో ఉమ్మడిగా పాల్గొననున్నారు. ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ అనే కార్యక్రమం పేరిట అమరావతి పరిధి గ్రామమైన మందడంలోని గోల్డెన్ రూల్ స్కూల్ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే ఈ భోగి వేడుకల్లో పవన్, చంద్రబాబు ఉదయం 7 గంటలకు పాల్గొననున్నారు. జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను భోగి మంటల్లో దహనం చేయనున్నారు.
Also Read: వైసీపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ బాలశౌరి
ముఖ్యమంత్రి జగన్ మోసపు హామీలు, పెత్తందారి పోకడలు, నిరుద్యోగ సమస్య, గంజాయి మాఫియా, అధిక ధరలు – పన్నుల బాదుడు, జె.బ్రాండ్స్, రైతు సంక్షోభం, అహంకారం నశించాలి వంటి అంశాలతో రూపొందించిన ప్లకార్డులను భోగి మంటల్లో వేసి దహనం చేయనున్నారు. ఆ తర్వాత ఆయా గ్రామాలకు చెందిన రైతులతో చంద్రబాబు, పవన్ ముచ్చటిస్తారు. ఇదిలాఉండగా సంక్రాంతి సందర్భంగా పవన్ కల్యాణ్‌ను చందబ్రాబు తన నివాసానికి భోజనానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
శనివారం రాత్రి ఉండవల్లిలో ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై వీరు పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ఓ వైసీపీ, మరోవైపు టీడీపీ-జనసేన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రస్తుతం పలు నేతలు పార్టీలు మారడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి.
Also Read: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జనవరి 16న సుప్రీం కోర్టు కీలక తీర్పు