Shoaib Akhtar: భారత స్టార్ బ్యాట్స్ మెన్ సచిన్ (Sachin) టెండూల్కర్, విరాట్ కోహ్లీలపై (Kohli) పాకిస్థాన్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం దుబాయ్‌లో (Dubai)) జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అక్తర్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
గ్రేటెస్ట్ ఎవర్..
ఈ మేరకు సచిన్ టెండూల్కర్ గ్రేటెస్ట్ ఎవర్, విరాట్ కోహ్లీ గ్రేట్ ప్లేయర్ గా పేర్కొన్న షోయబ్.. ఈ క్రీడలో ఆడిన గొప్ప ప్లేయర్లుగా వీరిద్దరి పేరు ఎప్పటికీ నిలిచిపోతాయన్నాడు. అలాగే విరాట్ నిలకడైన ఆటతీరును మాస్టర్ బ్లాస్టర్‌తో పోల్చుతూ ఎవరి శైలి వారిదే అన్నాడు. ‘మా కాలంలో అత్యుత్తమ బౌలర్లు వేసే రివర్స్ స్వింగ్ బంతులను ఎదుర్కొంటూ సచిన్ (Sachin Tendulkar) అద్భుతంగా బ్యాటింగ్ చేసేవాడు. అప్పట్లో ఒకటే సర్కిల్ ఉండేది. ప్రస్తుత కాలంలో సచిన్ ఆడి ఉంటే ఇంకా ఎక్కువ పరుగులు సాధించేవాడు’ అన్నాడు.
ఇది కూడా చదవండి : Virat : టీమిండియాకు బిగ్ షాక్.. విరాట్ కోహ్లీ అవుట్
మా తరంలో ఆడితే..
అలాగే ‘మా తరంలో రికీ పాంటింగ్, బ్రయాన్ లారా కూడా మంచి బ్యాటర్లు. విరాట్ మా కాలంలో ఆడి ఉంటే బౌలర్ల నుంచి చాలా కష్టాలు ఎదుర్కొనేవాడు. అయినా ఇప్పుడు చేసినన్ని పరుగులు చేసేవాడు. ఇప్పటిలాగే బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నా వసీం అక్రమ్‌ను ఎదుర్కోవడం అంత సులువయ్యేది కాదు. ఏదేమైనా విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. రెండు తరాలను పోల్చి చూడలేం. అతడికి హ్యాట్సాఫ్’అంటూ పొగిడేశాడు.
100 సెంచరీలు చేయాలి..
అలాగే వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసినందుకు విరాట్ ను అభినందిస్తూ 100 సెంచరీలు త్వరగా పూర్తి చేయాలని ఆకాంక్షించాడు. ఇక సచిన్ 664 మ్యాచుల్లో 48.52 సగటుతో 34,357 పరుగులు చేయగా.. 100 శతకాలు, 164 అర్ధ శతకాలున్నాయి. విరాట్ 522 అంతర్జాతీయ మ్యాచుల్లో 54.11 సగటుతో 26,733 పరుగులు చేయగా 80 శతకాలు, 139 అర్ధ శతకాలతో కొనసాగుతున్నాడు.