Cricket: టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) ప్రశంసలు కురిపించారు. బుమ్రా టెస్టుల్లో వేగంగా 150 వికెట్లు తీసిన మొదటి ఇండియా పేసర్‌గా రికార్డు సృష్టించడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇందుకు ఒక బలమైన కారణం కూడా ఉందని, ‘వైట్ బాల్’ స్పెషలిస్ట్‌గానే ముద్ర వేసిన వ్యక్తి 34 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడంటూ ఆసక్తికరంగా మాట్లాడారు.
అదే అతని కోరిక..
ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘నేను ఫస్ట్ టైమ్ బుమ్రాతో మాట్లాడిన రోజు ఇప్పటికీ గుర్తుంది. కోల్‌కతాలో అనుకుంటా.. అతనికి టెస్టు క్రికెట్ ఆడే ఆసక్తి ఉందా? లేదా? అని అడిగాను. దీంతో ‘అలాంటి అవకాశం లభిస్తే అది నా లైఫ్ లో బిగ్ డే గా నిలిచిపోతుంది’ అన్నాడు. అప్పటిదాకా బుమ్రాను ‘వైట్ బాల్’ స్పెషలిస్ట్‌గానే భావించారు. అతనికి ఇష్టం లేకపోయినా అలాగే ముద్ర వేశారు. కానీ బుమ్రా వికెట్లు తీయాలనే కసి, ఆకలితో ఉన్నాడని నాకు తెలుసు. దీంతో టెస్టులు ఆడేందుకు రెడీగా ఉండాలని సూచించాను. అప్పుడే దక్షిణాఫ్రికా పర్యటనకు తీసుకెళ్తానని చెప్పడంతో మరింత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బుమ్రా కూడా టెస్టు అరంగేట్రం చేయడానికి ఉత్సాహంగా ఉన్నానని చెప్పాడు. కోహ్లీతో కలిసి టెస్టు మ్యాచ్ లు ఆడాలనేది తన కోరికగా చెప్పాడు. చాలా మంది క్రికెటర్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతాలు చేస్తున్నారు. ఎవరికీ ఆ గణాంకాలు గుర్తుండవు. కానీ సుదీర్ఘ ఫార్మాట్లో ఎలా ఆడుతున్నారనేది మాత్రం అభిమానులు తప్పకుండా గమనిస్తారు. టెస్టులు అంత విలువైనవి’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి : National: హైదరాబాద్ కేంద్రంగా బిహార్ రాజకీయాలు!
సానబెట్టని వజ్రం..
ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రస్తావిస్తూ.. ‘ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే కోహ్లీపై దృష్టిపెట్టాను. బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే.. ‘భవిష్యత్తులో కెప్టెన్సీ చేపట్టాల్సి ఉంటుంది’ అని అతనికి చెప్పాను. ప్రతి అంశాన్నీ పరిశీలిస్తూ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించాను. అప్పటికే కోహ్లీ సానబెట్టని వజ్రంలా నాకు కనిపించాడు. కెప్టెన్ గా తనదైన దూకుడుతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండు లాంటి గడ్డలపై విజయాలు సాధించాడు’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు.