JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రోజురోజుకి హీట్ పెరిగిపోతుంది. ఒక్క కంపౌండ్ వాల్ కోసం ఇద్దరు నేతలు గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు పై మండిపడ్డారు. కేవలం అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA)ల కోసమే పోలీసులు పని చేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడిపత్రిలో ఒక గోడ కోసం ఇంత హంగామా చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి అంటే నాకు గౌరవం. ఆయన నిజనిజాలు తెలుసుకుని ప్రవర్తించాలని అన్నారు. కాంపౌండ్ వాల్ కోసం నేను పోరాడుతున్నాను అంటే అది కేవలం నా కోసం కాదు..తాడిపత్రిలోని రోడ్ల కోసం. ఇక్కడ ఉండే ప్రజల సౌకర్యాల కోసం పోరాడుతున్నానని ఆయన చెప్పారు.
కేవలం ఒక ఎమ్మెల్యే చెప్పినందుకే పోలీసుల బలగం మొత్తం తాడిపత్రికి దిగిపోయిందని ఆయన అన్నారు. వారికి మూడు రోజులకు అయిన ఖర్చు 25 లక్షలు. ఆ డబ్బుతో పోలీసులను పోషించే బదులు గోడ కట్టేయవచ్చని అన్నారు. కేవలం ఒక ఎమ్మెల్యేని కాపు కాయడానికి ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ పని చేయడం ఎందుకు..మండలానికి ఒక గుండాని పెట్టుకుని డబ్బులు ఇస్తే సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు.
డీఎస్పీ నన్ను ఏమి చేయలేరు. ఇప్పటికే చేయాల్సిందంతా చేశారు. నా మీద పెట్టిన కేసులు పూర్తి అవ్వాలి అంటే నేను ఇంకో జన్మ ఎత్తాలి. ఆయనకు మొదటి నుంచి కూడా నేను అన్న, నా కుటుంబం అన్న పడదని అన్నారు. ఇసుక అక్రమ రవాణాని ఆపలేరు కానీ..మా మీద దొంగ కేసులు పెడతారా అంటూ ఆయన విరుచుకుపడ్డారు.
డీఎస్పీకి ఏ నాయకుడు ఎంత ఇస్తున్నాడో అన్నింటిని కూడా లెక్కలతో సహా బయటపెడతామని ఆయన హెచ్చరించారు. గతంలో ఉన్న డీఎస్పీ మీద 12 కేసులు నమోదు చేశాము. డీఎస్పీ, సీఐలకు భయపడేది లేదంటూ జేసీ అన్నారు. ఎవరికీ భయపడేది లేదు. ఇసుకను బంద్ చేయండి .. లేకుంటే ఏమి అవుతోందో చూడండి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Also Read: తిరుమలలో చిరుత కదలికలకు కారణం అదే: పీసీఎఫ్ నాగేశ్వర రావు