ముంబై ఇండియన్స్‌కు కళ వచ్చేసింది. ఓడిపోయిన మ్యాచ్‌లకు బదులుగా క్యూలో నిలబడి మరీ విజయాలు రావాల్సిందే. ఎందుకంటే ఆ టీమ్ స్టార్ ఆటగాడు వచ్చేశాడు. అంతేకాదు రావడం రావడమే విజృంభించేశాడు. మూడు నెలల తర్వాత ఆడుతున్న సూర్య మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు కానీ...రెండో మ్యాచ్‌లో మాత్రం తన పేరును నిలబెట్టుకున్నాడు. నిన్న ముంబైలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లను చెడుగుడు ఆడేసుకున్నాడు. మరీ అన్యాయంగా 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసేశాడు. మొత్తం 19 బంతులు ఆడి 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 పరుగులు చేసి ముంబై విజయదాహాన్ని తీర్చాడు.
ఒక ఓవర్లో అయితే మరీ రెచ్చిపోయాడు మిస్టర్ 360. మూడు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టి 24 పరుగులు పిండుకున్నాడు. ఒకసారి ఫెయిల్ అవ్వొచ్చు కానీ నాలో ఉన్న శక్తిని ఆపడం ఎవరి తరమూ కాదని నిరూపించాడు. సూర్య ఆడిన సూపర్ ఓవర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వెలకమ్ సూర్యభాయ్, సూర్యతో ఇట్లుంటది మరీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సూర్య ఇదే ఫ్లో ను కంటిన్యూ చేస్తే ముంబయ్ ఇండియన్స్‌కు తిరుగుండదు. అంతేకాదు రాబోయే టీ20 వరల్డ్‌కప్ కు ఇండియాకు కలిసొచ్చే అంశంగా మారుతుంది.
ఇక నిన్న మ్యాచ్‌లో బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ మొదట బ్యాటింగ్ చేసి ముంబై ఇండియన్స్‌కు 196 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. దీన్ని ముంబై అలవోకగా ఛేదించేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 పరుగులు చేయగా...సూర్య కుమార్ యాదవ్ 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. కేవలం 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 7 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తుగా ఓడించింది.