Kolkata Doctor Murder Case: కోల్‌కతా డాక్టర్ కేసులో ప్రిన్సిపల్ పాత్రపై సుప్రీంకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. డాక్టర్ హత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వం ఎవరిని కాపాడ్డానికి ప్రయత్నిస్తోంది అంటూ తీవ్రంగా మండిపడింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించింది. దీని ఆధారంగా కోర్టు బెంగాల్ పోలీసులను ప్రశ్నలు వేసింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం విచారిస్తోంది. విచారణలో భాగంగా అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని సీల్ చేయడంలో నిర్లక్ష్యం ఎందుకు చేశారని ధర్మాసనం పోలీసులను ప్రశ్నించింది. అత్యాచారం జరిగిన ప్రదేశంలో ఆధారాలు చెరిపేసే ప్రయత్నం జరిగింది. బాధితురాలి పేరెంట్స్‌ను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. అంత్యక్రియల తర్వాత FIR నమోదు చేశారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారు అంటూ ధర్మాసనం పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు తీవ్రంగా కలిచివేశాయి. ఇలాంటి నిర్లక్ష్యాన్ని 30 ఏళ్ల సర్వీసులో చూడలేదని జస్టిస్ పార్థివాలా వ్యాఖ్యానించారు.
దీంతో పాటూ డాక్టర్ హత్య కేసులో ప్రిన్సిపల్ పాత్ర మీద కూడా అనుమానం వ్యక్తం చేసింది ధర్మాసనం. ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఎవరిని కాపాడాలని చూశాడు..అంత హడావుడిగా ప్రిన్సిపల్‌ని ఎందుకు బదిలీ చేశారని పోలీసులను, బెంగాల్ ప్రభుత్వ తరుఫు లాయర్లను అడిగారు జడ్జిలు. ఎఫ్ఐఆర్ నమోదుకు 14 గంటల ఆలస్యం ఎందుకైంది? అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని సీల్ చేయడంలో నిర్లక్ష్యం ఎందుకు? నేరం జరిగిన 18 గంటల తర్వాత ఆ ప్రదేశం సీల్ చేయడం వెనుక కారణాలేంటి? లాంటి ప్రశ్నలను లేవనెత్తింది ధర్మాసనం. అత్యాచారం జరిగిన ప్రదేశంలో ఆధారాలు చెరిపేసే ప్రయత్నం జరిగిందా? అందుకే అర్జంటుగా హత్య జరిగిన ప్రదేశంలో మరమ్మత్తులు పనులు చేపట్టారా అని ప్రశ్నించారు. రేపు సాయంత్రం లోపు పాలీగ్రాఫ్ టెస్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని కోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కోల్‌కతా ట్రెయినీ డాక్టర్ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. బెంగాల్ ప్రభుత్వం తరుఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కేసును వాదించారు. అయితే సోషల్‌మీడియాలో వచ్చే పాయింట్స్ కోర్టులో వాదించొద్దంటూ కపిల్ సిబల్‌పై సీజేఐ సీరియస్ అయింది.
ఇక డాక్టర్లు విధులకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశం మరో అత్యాచారం కోసం వేచి చూడడం లేదని..బాధితురాలికి న్యాయం జరిగేలా చేస్తామని చెప్పింది. అలాగే 13 రోజులుగా డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంపై...ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. దాంతో పాటూ ఈ కేసుని రాజకీయం చేయొద్దంటూ ఇరు పక్షాలకు హెచ్చరించింది.
Also Read: Andhra Pradesh: వైసీపీలో ప్రధాన కార్యదర్శుల నియామకం