Kavitha Bail: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. సుప్రీంకోర్టులో (Supreme Court) ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 20కి ఆమె బెయిల్ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. సీబీఐ (CBI), ఈడీ (ED) నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ జులై 1న ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. లిక్కర్ కేసులో (Delhi Liquor Scam) సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
Also Read: 10 రోజులు దాటింది.. మేఘా కంపెనీపై ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు : కేటీఆర్
ఈ కేసులో 50 మంది నిందితుల్లో తాను ఏకైక మహిళ అని.. ఒక తల్లిగా పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. అయినప్పటికీ కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. మళ్లీ ఇవే అంశాల ఆధారంగా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పుడు తాజాగా అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. ఇక కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె తీహార్ జెల్లోనే ఉంటున్నారు.
ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. చివరికి మళ్లీ బెయిల్ విచారణ వాయిదా పడటంతో వాళ్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.