Stock Market Today: ఈరోజు దలాల్ స్ట్రీట్ నష్టాలతో మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు...దానికి తోడు షేర్ల (Shares) విలువ పెరిగిందని మదుపర్లు అనుకోవడంతో గురువారం సూచీలు నష్టాల బాట పట్టాయి. మరోవైపు కోవిడ్ (Covid Cases) కలకలం కూడా మార్కెట్ల మీద ప్రభావం చూపెట్టాయి. ఇక అంతర్జాతీయ ముడి చమురు ధరలు కూడా మర్కెట్లను శాసిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ (Sensex) 432 పాయింట్లు నష్టపోయి 70004 దగ్గర, నిఫ్టీ (Nifty) 140 పాయింట్లు దిగజారి 21, 099 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 83.22 దగ్గర కొనసాగుతోంది.
Also Read:ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు
నిఫ్టీలో మారుతి సుజుకీ, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, యాక్సిస్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు నష్టాల్లో ఉండగా...రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న సాయంత్రం మార్కెట్లు క్లోజ్ అయ్యాక ఓవర్ నైట్ లో డౌ జోన్స్, S&P 500 వరుసగా 1.27 శాతం, 1.47 శాతం క్షీణించగా, నాస్‌డాక్ కాంపోజిట్ 1.5 శాతానికి పడిపోయింది. మరోవైపు యూఎస్ మార్కెట్ల నష్టాలను ఆసియా మార్కెట్లు అందిపుచ్చుకున్నాయి. జపాన్ లోని నికాయ్ 1.4 శాతం నష్టపోయింది. ఆస్ట్రేలియా S&P/ASX 200, దక్షిణ కొరియా 0.6 శాతం వరకు పడ్డాయి. ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ 53 పాయింట్లు లేదా 0.25% రెడ్ కలర్‌లో 21,142 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.