సీఎం కేసీఆర్‌పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నానని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కానీ రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో 12, 13 గంటల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతున్నట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తుందన్న ఎంపీ.. రానున్న రోజుల్లో 12 గంటల విద్యుత్‌లో సైతం కోత విధించే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ సర్కార్ ఇచ్చే విద్యుత్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉచిత విద్యుత్‌పై కేసీఆర్ మాట తప్పారన్న ఎంపీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 24 గంటల విద్యుత్ ఇచ్చే ప్రభుత్వం కావాలా 3 గంటల విద్యుత్ ఇచ్చే ప్రభుత్వం కావాలా అని ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్గోండ మండల పరిధిలోని అప్పాజీ పేటలో కనీసం ఆరు గంటల విద్యుత్ కూడా రావడంలేదని తనకు అనేక సార్లు ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపి కోమటిరెడ్డి వెల్లడించారు. దీంతో తమ పోలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. 24 గంటల విద్యుత్ ఇచ్చే దమ్ము లేకపోతే కేసీఆర్ చెప్పాలని, ఇలా చాలీ చాలనంత కరెంట్ ఇచ్చి రైతుల ఉసురుపోసుకోవద్దని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఒకవేల 24 గంటల విద్యుత్ ఇవ్వాలంటే పక్కరాష్ట్రాల నుంచి అయినా తీసుకొచ్చి రాష్ట్రంలో రైతులకు ఇవ్వాల్సిందేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పిన సీఎం మాటలు నమ్మిన రైతులు నాట్లు వేసుకున్నారని, ప్రస్తుతం విద్యుత్ అందకపోవడం వల్ల వారు పడ్డ శ్రమ వారి కళ్లముందే ఎండకు ఎండిపోతోందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై రైతులు కేసీఆర్ మాటలు నమ్మరని, రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ఎన్ని ఎత్తుగడలు వేసినా రైతులు వారికి మేలు చేసే పార్టీకే ఓటు వేస్తారన్నారు. మూడు నెలల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు.