Test Cricket: దక్షిణాఫ్రికాతో వైట్ వాష్.. భారత్ టెస్ట్ లను వదిలేస్తోందా? అసలైన క్రికెట్ ఏమౌతోంది?

గతేడాది న్యూజిలాండ్, ఇప్పుడు దక్షిణాఫ్రికా..ఇద్దరి చేతిలోనూ టీమ్ ఇండియా వైట్ వాష్ అయింది. స్వదేశాల్లో టెస్ట్ లలో చిత్తుగా ఓడి విమర్శలు పాలైంది. అసలేమౌతోంది..టీమ్ ఇండియా టెస్ట్ లను ఎందుకు ఆడలేకపోతోంది.

New Update
test cricket

ఇంతకు ముందు భారత్ లో టీమ్ ఇండియాను ఓడించాలంటే మిగతా టీమ్ లన్నీగడగడలాడేవి. ఒకవేళ గెలిస్తే అదో పెద్ద ఘనతలా భావించేవి. కానీ ఇప్పుడు టీమ్ ఇండియాను ఈజీగా ఓడించేస్తున్నాయి. అది కూ డా వైట్ చేసేస్తున్నాయి. భారత్‌ను సొంతగడ్డపై ఓడించడం పెద్ద విషయమే కాదని చాటి చెబుతున్నాయి. ఇదంతా రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మార్పులు. ఫాస్ట్ క్రికెట్ కు అలవాటు పడిన భారత ఆటగాళ్ళలో ఓపిక ఉండడం లేదు. గంటల తరబడి క్రీజులో ఉండడం చాలా కష్టమైపోతోంది. దీని కారణంగా సొంతగడ్డపై ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్న భారత్‌ను నిరుడు న్యూజిలాండ్‌ నేలమీదికి దించితే.. ఇప్పుడు దక్షిణాఫ్రికా మన జట్టును పాతాళానికి తోసేసింది. దీని నుంచి టీమ్ ఇండియా ఎలా గట్టెక్కుతుంది. టెస్ట్ క్రికెట్ ను ఇప్పటికైనా సీరియస్ గా తీసుకుంటుందా?

ఫాస్ట్ గా ఆడ్డానికి అలవాటు పడిపోయి..

ప్రస్తుతం భారత్ దృష్టి అంతా టీ20లపైనే ఉంది. సీనియర్ల దగ్గర నుంచీ కుర్రాళ్ళ వరకూ వచ్చామా, షాట్లు కొట్టామా , వెళ్ళామా అనే చూస్తున్నారు. డిఫెన్స్ ఆడాలన్న విషయమే మర్చిపోయారు. లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ తో టెస్ట్ సీరీస్ చిత్తుగా ఓడిపోయాక...ఆ దెబ్బకు భారత జట్టు పాఠం నేర్చుకుంటుంది అనుకున్నారు అంతా. కానీ మొత్తంగా ఆ విషయమే పక్కన పెట్టేశారు. దానికి తోడు సీనియర్లు జట్టు నుంచి వెళ్ళిపోయారు. దాంతో టెస్ట్ లలో ఘోరంగా విఫలమౌతున్నారు. ఏడాది వ్యవధిలో రెండు సిరీస్‌ల్లో వైట్‌వాష్‌లకుగురైందంటే.. ఆటతీరులోనే పెద్ద లోపం ఉందన్నది క్లియర్ గా తెలుస్తోంది. ఈ రెండిటిలోనూ ప్రత్యర్థులు చాలా బాగా ఆడారు అని చెప్పే కంటే..మనవాళ్లు చెత్తగా ఆడారు అని చెప్పడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఓడిన తీరు చాలా చాలా ఆందోళన లిగించే అంశంగా మారింది. ఎక్కడా ఎందులోనూ సరైన టెక్సిక్ తో ఆడడం లేదు. పరిస్థితికి తగ్గట్టు ఆటతీరును మార్చుకోవడం లేదు. ఈ కారణంగా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఘోరం ఫెయిల్ అవుతున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన ఇంగ్లాండ్‌ పిచ్‌లపై రాణించి.. సొంతగడ్డపై స్పిన్‌కు అనుకూలంగా మారిన వికెట్లపై మన బ్యాటర్లు చతికిలపడ్డారు. టెస్టులంటే ఓపిక, సంయమనంతో ఆడాలనే ప్రాథమిక సూత్రాన్ని ముఖ్యంగా కుర్రాళ్ళు మర్చిపోయారు.

టెక్నిక్ మర్చిపోయారు..

భారత్ జట్టు బలం మొదటి స్పిన్. కానీ ఇప్పుడు మనవాళ్లు దానికే బెంబేలెత్తిపోతున్నారు. ఇతర దేశాల ఆటగాళ్ళు వచ్చి మన స్పిన్ ను చితక్కొట్టేస్తుంటే మనం మాత్రం చేతులెత్తేస్తున్నాం. దానికి తోడు మ్యాచ్ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. పిచ్చి షాట్లు కొడుతూ అవుటైపోతున్నారు. షౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో కనీసం సగం వికెట్లు అనవసర షాట్లకు ప్రయత్నించి కోల్పోయినవే. బౌన్సర్లను ఆడలేక తెలియక వికెట్లను సమర్పించుకున్నారు. తొలిసారి భారత్‌లో పర్యటించిన హార్మర్‌.. భారత బ్యాటర్లను అంతగా ఇబ్బంది పెట్టడం, అన్నన్ని వికెట్లు తీయడమేంటో..మనవాళ్ళకే తెలియాలి. అదే ప్లేస్ లో మన బౌలర్లు మాత్రం మన పిచ్ లను ఉపయోగించుకోలేక పోవడం మరో వింత. దీంతో వాళ్ళు ధారాళంగా పరుగులు రాబట్టుకొంటే మనం మాత్రం కాసేపు క్రీజులో నిలబెట్టుకోవడానికే ఆపపోపాలు పడిపోయారు. అసలు ప్రత్యర్థి మన దగ్గరికి వచ్చిందా? లేక ప్రత్యర్థి దేశానికి వెళ్లి మనం ఆడుతున్నామా అనిపించేలా.. దక్షిణాఫ్రికా ఆధిపత్యం చలాయిస్తుంటే, భారత జట్టు బేలతనాన్ని ప్రదర్శించింది. కఠిన పరిస్థితులుండే విదేశాల్లో విజయాలు సాధించిన జట్టు.. ఇప్పుడు సొంతగడ్డపై ఓటములు తప్పించుకోవడం కోసం పోరాడే స్థితికి రావడం భారత క్రికెట్‌ దీన స్థితికి రుజువు.

గంభీర్ పాత్రపైనా..

అసలిప్పుడున్న క్రికెటర్లకు ఎవరికైనా టెస్ట్ లు ఆడే సామర్ధ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి రావడానికి, ప్రపంచ క్రికెట్లో భారత్‌ ఒక శక్తిగా ఎదగడానికి ఐపీఎల్తోడ్పడిందనడంలో సందేహం లేదు. కానీ ఆ లీగ్‌ ప్రభావంతో బాదుడే లక్ష్యంగా సాగుతున్న కుర్రాళ్లలో టెస్టులు ఆడే నైపుణ్యం మాత్రం తగ్గిపోతోంది. టెస్ట్ లకుతగ్గట్టు గంటలు గంటలు నిలబడడం, ఆచి తూచి ఆడడం ఇవన్నీ చాలా పెద్ద విషయాలు అయిపోయాయి. దాంతో పాటూ ప్రస్తుతం ఉన్న కోచ్ పాత్రపై కూడా చాలా చర్చ జరుగుతోంది. కోచ్ అనేవారు జట్టును వెనకుండి నడిపించాలి. కానీ గౌతమ్ గంభీర్ మాత్రం దాన్ని అస్సలు చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్ సమర్ధవంతంగా చేసిన ఆ పనిని గంభీర్ మాత్రం గాలికి వదిలేశాడని విమర్శలు వినిపిస్తున్నాయి. తన జట్టు అనిపించుకోవడానికి రోహిత్, కోహ్లీ, అశ్విన్ లాంటి వారిని జట్టు నుంచి తరిమేశాడనే వాదన కూడా ఉంది. జట్టులో పదే పదే మార్పులు చేయడం.. పిచ్‌ల విషయంలో అతిగా జోక్యం చేసుకోవడం.. కొందరు ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలిచ్చి, కొందరిని విస్మరించడం.. ఇలా గంభీర్‌ అనేక విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దాంతో పాటూ ఎప్పుడూ కోపంగా ఉండడం, ముక్కు సూటిగా వ్యవహరించడం లాంటి ప్రవర్తనతో జట్టు వాతావరణాన్ని కూడా దెబ్బ తీస్తున్నాడని చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు