/rtv/media/media_files/2026/01/20/bowlers-2026-01-20-07-53-42.jpg)
సొంత గడ్డపై మన వాళ్ళు పులులు..స్పిన్నింగ్ లో దంచేస్తారు...ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు అంతా డొల్లే కనిపిస్తోంది. విదేశాల్లో మాట అటుంచితే...స్వదేశంలో కూడా ఏమీ చేయలేకపోతున్నారు. దీనికి నిదర్శనమే సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ , న్యూజిలాండ్ తో వన్డే సీరీస్ ఓడిపోవడం. బ్యాటర్లు బాగానే చెమటోడ్చి కష్టపడుతున్నా..బౌలర్లు మాత్రం మొత్తం అంతా తుడిచి పెట్టేస్తున్నారు. పైగా ఇంకో పదిహేను రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ఉంది. అలాగే వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ కూడా ఉంది. ఇలాంటి టైమ్ లో టీమ్ ఇండియా ఆటగాళ్ళ చెత్త ప్రదర్శన అన్ని విధాలుగా ఆందోళనకరంగా మారింది. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సీరీస్ లో బ్యాటర్లు కూడా విఫలమయ్యారు.
న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల సీరీస్ జరిగింది. ఇందులో మొదటి మ్యాచ్ మాత్రమే భారత్ గెలిచింది. మిగిలిన రెండూ కీవీస్ కొట్టుకెళ్ళిపోయింది. దీనికి ప్రధాన కారణం.. భారత్ బంతితో ప్రత్యర్థిని కాస్తయినా భయపెట్టలేకపోయింది. మన బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. సీరీస్ లో సగటున ఓవర్ కు 6.2 పరుగులిచ్చారంటే అర్ధమౌతోంది మన వాళ్ళు ఎంత దారుణంగా బౌలింగ్ చేశారో. పిచ్ లు బౌలింగ్ కు అనుకూలం కాదు నిజమే..కానీ అవే పిచ్ లపై కీవీస్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. మనవాళ్లు మాత్రం చేతులెత్తేశారు. పైగా మనకు స్వదేశం అన్న ట్యాగ్ కూడా ఉంది.
ధారాళంగా పరుగులు..
అసలు టీమ్ ఎంపికే పెద్ద మైనస్. మొదటి నుంచి ఈ మాట వినిపిస్తూనే ఉంది. ఈ వన్డే సీరీస్ కు బుమ్రాను ఎందుకు ఎంపిక చేయలేదో తెలియదు. టీ20 వరల్డ్ కప్ కోసం అతనికి విశ్రాంతి ఇచ్చారు. కానీ అతని లేని లోటు పూర్తిగా కనిపించింది. భారత పేస్ అసలు ఎటాక్ చేయలేకపోయింది. హర్షిత్ రాణా బాగానే వికెట్లు తీసినా..పరుగులు మాత్రం ధారాళంగా ఇచ్చేశాడు. మహ్మద్ సిరాజ్ (3 వికెట్లు, ఎకానమీ 4.59) కట్టుదిట్టంగానే బౌలింగ్ చేసి, బ్యాటర్లకు కళ్లెం వేసినా.. జట్టుకు అవసరమైన వికెట్లను అందించలేకపోయాడు. మరోవైపు ప్రసిద్ధ్ ఏమాత్రం ప్రభావం చూపలేపోయాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అసలు బౌలింగ్ ఎంపికపైనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఆఖరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసే బుమ్రా గైర్హాజరీలో అర్ష్‌దీప్‌ను ఆఖరి మ్యాచ్‌లో గానీ జట్టులోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆల్ రౌండర్ నితీశ్ కూడా తేలిపోయాడు. వచ్చే ఏడాది లోపు ఈ సమస్యను పరిష్కరించకపోతే..కష్టమే అని అంటున్నారు. బుమ్రా, హార్దిక్ పాండ్య తిరిగి జట్టులోకి వస్తే పేస్ బౌలింగ్ చక్కబడుతుంది..కానీ వాళ్ళు లేకపోతే ఇక అంతే అన్న పరిస్థితులు మాత్రం అస్సలు మంచి విషయం కాదు.
స్పిన్ అసలెక్కడుంది..
ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే...అది మరీ దారుణంగా తయారైంది. ఎడమచేతి వాటం స్పిన్నర్లు జడేజా, కుల్‌దీప్ యాదవ్ పూర్తిగా తేలిపోయారు. గతంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన కుల్‌దీప్, ఈ సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యారు. పరుగుల వేగానికి అడ్డుకట్ట్టావేయలేకపోయారు. ఈ ఒక్క సీరీస్ లోనే కాదు..ఈ స్పిన్నర్ల సమస్య ఇంతకు ముందు నుంచే ఉంది. అక్షర్ పటేల్ ను కాదని జడేజాను ఉంచడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. పేలవ ప్రదర్శనల నేపథ్యంలో జడేజా వన్డే భవిష్యత్తుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతన్ని ఎందుకు పక్కన పెడుతున్నారనేది మాత్రం తెలియడం లేదు.
Follow Us