/rtv/media/media_files/2025/10/23/ind-vs-sa-series-team-india-all-rounder-hardik-pandya-fitness-update-2025-10-23-08-43-45.jpg)
ind vs sa series team india all rounder hardik pandya fitness update
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో తలపడుతున్న టీమిండియాకు మంచి వార్త అందింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలో పూర్తి ఫిట్‌నెస్ సాధించి దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
గాయంతో ఆస్ట్రేలియా పర్యటనకు దూరం:
ఆసియా కప్ 2025 ఫైనల్‌కు ముందు హార్దిక్ పాండ్యాకు ఎడమ కాలి తొడ కండరానికి (క్వాడ్రిసెప్స్) గాయమైంది. దీంతో అతడు ఫైనల్ మ్యాచ్‌తో పాటు, ఆస్ట్రేలియా పర్యటన మొత్తానికి దూరమయ్యాడు. హార్దిక్ గాయం కారణంగానే యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ఆస్ట్రేలియా సిరీస్‌లో వన్డే, టీ20 జట్లలో చోటు దక్కింది. నితీష్ పర్త్‌లో తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
🚨 HARDIK PANDYA IS COMING 🚨
— Tanuj (@ImTanujSingh) October 22, 2025
- Hardik Pandya is set to return in Team India in the white ball series against South Africa. (Sahil Malhotra/TOI). pic.twitter.com/0CijbEKPND
గాయం నుంచి కోలుకోవడానికి హార్దిక్ పాండ్యా అక్టోబర్ 14న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)కి చేరుకున్నాడు. దీపావళి సందర్భంగా ముంబైకి వచ్చినా, తిరిగి ఎన్‌సీఏలో శిక్షణ ప్రారంభించాడు. హార్దిక్ రాబోయే నాలుగు వారాల పాటు సీఓఈలో కఠిన శిక్షణ తీసుకోనున్నట్లు సమాచారం. తద్వారా దక్షిణాఫ్రికా సిరీస్‌కు పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యాకు సర్జరీ అవసరం లేదని బీసీసీఐ వైద్య బృందం స్పష్టం చేసింది. వైట్ బాల్ క్రికెట్‌లో కీలక ఆటగాడిగా ఉన్నందున, బీసీసీఐ మెడికల్ టీమ్ అతని ప్రతి కదలికను పర్యవేక్షిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని హార్దిక్ ఫిట్‌నెస్ విషయంలో బోర్డు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు.
హార్దిక్ లేకపోవడం పెద్ద లోటు:
టీమిండియా బ్యాటింగ్ కోచ్.. హార్దిక్ లేకపోవడంపై స్పందించారు. "హార్దిక్ వంటి ఆటగాడు జట్టులో లేకపోవడం ఎప్పుడూ పెద్ద లోటే. కానీ, సానుకూల అంశం ఏమిటంటే, నితీష్ రెడ్డికి ఈ సమయంలో ఆడే అవకాశం లభిస్తోంది. ప్రతి జట్టుకు ఆల్‌రౌండర్లు అవసరం. అందుకే నితీష్‌ను ఆ పాత్రకు సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అయినప్పటికీ, హార్దిక్ లాంటి ఆటగాడిని ఏ జట్టు అయినా మిస్ అవుతుంది" అని కోటక్ అన్నారు.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 9 నుంచి ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ కీలక సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఫిట్‌గా తిరిగి వస్తాడని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.