IND Vs Pak Asia Cup 2025: అరుదైన వీడియో.. పాకిస్తాన్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వని భారత్ - కళ్లముందే డోర్ వేసి

ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం, షేక్ హ్యాండ్ వివాదం తలెత్తింది. విజయం తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్ళు కరచాలనం కోసం ఎదురుచూస్తుండగా, భారత జట్టు వారిని పట్టించుకోకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి తలుపులు మూసుకుంది.

New Update
IND Vs Pak Asia Cup 2025

IND Vs Pak Asia Cup 2025

ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) భారత్ VS పాకిస్తాన్‌ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 15.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఫినిష్ చేసింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం గ్రౌండ్‌లో ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. 

IND Vs Pak Asia Cup 2025

మ్యాచ్ ముగిసిన వెంటనే విజేతగా నిలిచిన టీమిండియా ప్లేయర్స్ హ్యాండ్‌షేక్ చేయకుండానే నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ ఆటగాళ్లను ఆశ్చర్యపరిచింది. అలాగే క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా క్రికెట్‌లో మ్యాచ్ పూర్తయిన తర్వాత ఇరు టీంల ప్లేయర్లు ఒకరితో ఒకరు హ్యాండ్‌షేక్ చేసుకుని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తారు. 

కానీ ఈసారి టీమిండియా ప్లేయర్లు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఈ ఘటనపై పాకిస్తాన్ టీం ప్లేయర్లు, అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. పాక్ మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు ఈ చర్య క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని.. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆశ్చర్యకరమైన ఘటన వెనుక ఉన్న కారణాలపై ఎన్నో ఊహాగానాలు బయటకు వినిపిస్తున్నాయి. 


ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఎంతో మంది అమాయకులు చనిపోయారు. వారికి నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్‌లో సిక్స్ కొట్టి విజయం సాధించిన తర్వాత టీమిండియా బ్యాటర్లు గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అయితే మ్యాచ్‌కు ముందు కూడా టాస్ వేసిన అనంతరం భారత్ కెప్టెన్ సూర్య కుమార్ పాక్ కెప్టెన్‌తో షెక్‌హ్యాండ్స్ తీసుకోకపోవడం గమనార్హం అనే చెప్పాలి.  

ఇక ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన విజయాన్ని పహల్గామ్ బాధితులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. దీని బట్టి ఈ చర్య ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, సైనికులకు మద్దతుగా ఒక నిరసనగా భావించవచ్చని పలువురు అంటున్నారు. ఈ సంఘటనకు ముందు కూడా ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని భారతదేశంలో తీవ్రమైన డిమాండ్లు వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ఎలాంటి క్రీడా సంబంధాలు పెట్టుకోవద్దని ప్రజలు సోషల్ మీడియాలో నినాదాలు చేశారు. ఈ ఒత్తిడి కారణంగానే భారత ఆటగాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు