/rtv/media/media_files/2026/01/25/icc-2026-01-25-07-27-53.jpg)
వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంది. ఆ దేశ క్రికెట్ బోర్డు (BCB) తన పట్టుదలకు పోయి టోర్నీని బహిష్కరించడంతో, ఐసీసీ రంగంలోకి దిగి బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును భర్తీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో తమ జట్టుకు భద్రతా ముప్పు ఉందని, అందుకే తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. స్వతంత్ర భద్రతా సంస్థల ద్వారా తనిఖీలు చేయించిన ఐసీసీ, భారత్‌లో అటువంటి ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసినప్పటికీ, బంగ్లాదేశ్ మాత్రం వెనక్కి తగ్గలేదు.
ఐసీసీ 24 గంటల గడువు
ఈ వివాదం గత మూడు వారాలుగా సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం భారత్‌లో ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో, ఐసీసీ వారికి 24 గంటల గడువు విధించింది. అయినప్పటికీ బంగ్లాదేశ్ బోర్డు నుండి సానుకూల స్పందన రాకపోవడంతో, ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉండి, క్వాలిఫై అవ్వలేకపోయిన జట్లలో స్కాట్లాండ్ మొదటి వరుసలో ఉంది. దీంతో ఆ జట్టుకు గ్రూప్-సిలో చోటు కల్పించారు. ఇప్పుడు స్కాట్లాండ్ జట్టు ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్, వెస్టిండీస్ జట్లతో తలపడనుంది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేయడం వంటి పరిణామాలు రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య చిచ్చు పెట్టాయి. "మేము వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నాం కానీ, ఇండియాలో మాత్రం ఆడము" అని బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి.
మరోవైపు, తమ దేశ క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో ఇప్పుడు బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
Follow Us