KCR : భారత్ రాష్ట్ర సమితి(BRS) పేరును మార్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్(TRS) గా మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ సభలో దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఎంపీ ఎన్నిక(MP Elections) ల్లో టీఆర్‌ఎస్ పేరుతో పోటి చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కందాల ఉపేందర్ రెడ్డి !
అయితే గతంలో ఉన్న టీఆర్‌ఎస్‌ను.. బీఆర్‌ఎస్‌గా ప్రకటించి, అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల్లో ఓటమి తర్వాత మళ్లీ టీఆర్‌ఎస్‌గా మారిస్తే ఏమైన చిక్కులు ఎదురవుతాయా అనే అంశాలపై కూడా అధిష్ఠానం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌గా మార్చాలని పార్టీ కార్యకర్తలు కూడా పట్టుబడుతున్నారు. అంతేకాదు మెజార్టీ బీఆర్‌ఎస్ నేతల అభిప్రాయం కూడా ఇదే. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) ఎప్పటినుంచో ఈ విషయాన్ని ఓపెన్‌గానే చెబుతున్నారు. బీఆర్‌ఎస్ పేరును మార్చాక పార్టీకి చాలా నష్టం జరిగిందని నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా.. ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య.. అలాగే కె.కేశవరావు, ఆయన కూతరు హైదరాబాద్(Hyderabad) మేయర్ విజయలక్ష్మీ వంటి వారు కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఈసారి రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తారో తేలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. మే 13 తెలంగాణలో ఎంపీ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read : ఎర్రటి ఎండల్లో చల్లటి కబురు..2 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు