మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ల రహస్య భేటీ సంచలనం రేపుతోంది. వారిద్దరి భేటీ దేశ రాజకీయాలనే మలుపు తిప్పబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విపక్ష ఇండియా కూటమిలో శరద్ పవార్ కీలక నేతగా వున్నారు. ఆయన బీజేపీ వైపు చేరితే అటు మహా వికాస్ అఘాడీ కూటమికి, ఇటు విపక్ష ఇండియా కూటమికి భారీ ఎదురు దెబ్బ తగులుతుంది. దీంతో అటు మహా రాష్ట్రలో ఎన్సీపీ మిత్ర పక్షాలు, ఇటు ఇండియా కూటమి పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
కాంగ్రెస్‌లో మొదలైన ఆందోళన...!
శరద్ పవార్, అజిత్ పవార్ రహస్య భేటీపై కాంగ్రెస్‌లో తీవ్ర ఆందోళన మొదలైంది. వారి భేటీపై మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరువురు నేతల భేటీ తమకు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఇరువురి మధ్య రహస్య సమావేశం తమకు ఏ మాత్రమూ అమోదయోగ్యం కాదన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చిస్తారని అన్నారు. ఇక శరద్ పవార్ ఇండియా కూటమిలో కీలక నేతగా వున్నారని, అందువల్ల ఈ విషయాన్ని ఇండియా కూటమి నేతలతో కూడా చర్చిస్తామని పేర్కొన్నారు.
అజిత్ పవార్ పై శివసేన ఫైర్....!
శరద్ పవార్ కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసేంత సీన్ అజిత్ పవార్ కు లేదని శివసేన(యూబీటీ)నేత సంజయ్ రౌత్ అన్నారు. అజిత్ ను రాజకీయంగా బలమైన నేతగా శరద్ పవార్ తీర్చి దిద్దారని, అంతే కానీ శరద్ పవార్ ను అజిత్ పవార్ తీర్చిదిద్దలేదన్నారు. శరద్ పవార్ చాలా ఉన్నతమైన స్థితిలో వున్నారని చెప్పారు. అయితే ఆయన వ్యాఖ్యలు మేకపోతు గాంబీర్యాన్ని గుర్తుకు తెస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
అంతకు ముందు ఆయన ఇరువురు నేతలపై ఆయన ఫైర్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు తమ సంబంధాలను కొనసాగించేందుకే భేటీ అయ్యారన్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. నేతలిద్దరూ తమ సంబంధాలను కొనసాగిస్తున్నట్టయితే వారి మద్దతులు మాత్రం ఒకరితో ఒకరు ఎందుకు పోట్లాడాలని ఆయన ప్రశ్నించారు.
పొలిటికల్ గా శరద్ పవార్ బలం....!
మరాఠా x శరద్ పవార్ కు మంచి పట్టు వుంది. ఆయన మద్దతు ఇస్తే రాష్ట్రంలో 30 వరకు లోక్ సభ స్థానాల్లో విజయం సాధించ వచ్చని బీజేపీ భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో ఆయనకు చాలా పార్టీలతో మంచి సంబంధాలు వున్నాయి. ఇలాంటి క్రమంలో ఆయన తమతో చేరితే విపక్ష ఇండియాను కోలుకోలేని దెబ్బ తీయవచ్చని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం.
రాజకీయాలను మలుపు తిప్పుతున్న అజిత్ పవార్....!
మహారాష్ట్ర రాజకీయాలను అజిత్ పవార్ మలుపుతిప్పుతున్నారు. మొన్నటి దాకా శరద్ పవార్ వెంట నడిచిన ఆయన అనూహ్యంగా బీజేపీ వైపు మళ్లారు. ఒక్క సారిగా డిప్యూటీ సీఎం పోస్టు కొట్టేశారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. ఇక ఇప్పుడు రాజకీయ కురువృద్దుడు శరద్ పవార్ ను కూడా బీజేపీతో చేరేలా ఒప్పించేందుకు పావులు కదుపుతున్నాడు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే త్వరలో సీఎం అయినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.