తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్ళు మొదలవుతున్నాయి. ఇవాల్టితో సెలవులు ముగిశాయి. ఎప్పటిలానే జూన్ 12నుంచి తరగతి గదులు ప్రారంభం అవనున్నాయి. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్కూళ్ళను పునఃప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే ఇక్కడ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఇది మొదలైంది. అయితే ఆంధ్రాలో మాత్రం వేసవి సెలవులు ఒకరోజు పొడిగించారు. రేపు అక్కడ చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉన్న కారణంగా సెలవును పొడిగించారు. అక్కడ 13వ తేదీ నుంచి స్కూళ్ళు ప్రారంభం అవుతాయి.
ఇక ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ తెలిపింది. ప్రవైటు సూళ్ళల్లో ఉదయం 8 గంటలకే తరగతులు మొదలవుతాయి.అందుకే ప్రభుత్వ బడుల్లో కూడా టైమింగ్స్ మార్చామని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, డ్రాపౌట్ల సంఖ్యను తగ్గించేందుకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కొత్త విద్యా సంవత్సరంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 90 శాతం విద్యార్ధుల హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశించారు. దానికోసం పేరెంట్స్ కమిటీలు, విద్యా కమిటీలు, స్థానిక స్వచ్ఛంధ సంస్థలు, ఉపాధ్యాయులను భాగస్వామ్యుల్ని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.