చంద్రబాబు చెప్పాలనుకునేవి పవన్ కళ్యాణ్‌తో చెప్పిస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత జైల్లో కూర్చొని తాను అనుకున్నవి పవన్‌తో చెప్పిస్తున్నాడన్నారు. పవన్ నటుడు కాబట్టి అన్ని రకాల ఎమోషన్‌లతో చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ చదవుతున్నారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. పవన్ చేస్తున్న పని కొత్తేం కాదన్న సజ్జల.. 2014 నుంచి పవన్ ఇదే పని చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ తన మనస్సులో మాటను ఎప్పుడూ దాచుకోలేదని ఎద్దేవా చేశారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేశాడని, కానీ ఇప్పుడు టీడీపీతో కలిసి పనిచేస్తామని తన మనస్సులో మాటను బయటకు చెప్పాడన్నారు. పవన్ అభిమానులకు ఇదో బ్యాడ్ న్యూస్ అన్నారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి పవన్ ప్రయత్నిస్తున్నారన్నారు. పవన్ సీఎం కాలేడన్న ఆయన.. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని ఆశతో ఉన్న అభిమానులు వారి ఆశను చంపుకోవాలని సూచించారు. మరోవైపు విపక్షాలు ఏకమై వైసీపీని గద్దె దించుతామని పవన్ కళ్యాణ్ అంటున్నారన్న సజ్జల.. విపక్షాలే కాదు ఎన్ని శక్తులు ఏకమైనా, ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి 60 శాతం ఓటు బ్యాంకు ఉందని సజ్జల వెల్లడించారు.
అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందని, వవన్ కళ్యాణ్‌లా ఎగిరి ఎగిరి పడదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ చంద్రబాబులా ప్రజలను మోసం చేయలేన్నారు. సీఎం జగన్ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారిని ఆదుకుంటుంన్నారన్నారు. ప్రజల అవసరాలను తెలుసుకొని ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటుదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలకు సీసీరోడ్లు ఏర్పాటు చేసిందన్నారు. చంద్రబాబులా స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో తమ ప్రభుత్వం కోట్ల కొద్ది డబ్బును దోచుకోలేదని సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు.