ఆంధ్రప్రదేశ్‌లో పుంగనూరు రాజకీయ వేడి కొనసాగతూనే ఉంది. తాజాగా దీనిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పందించారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పుంగనూరుకు రాకుండా లారీని అడ్డం పెట్టింది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఆ లారీని పక్కకు తీస్తున్న టీడీపీ నేతలపై లాఠీచార్జి చేసిన పోలీసులు.. లారీని రోడ్డుకు అడ్డంపెట్టిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన వ్యక్తిని అడ్డుకుంటుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పని చేశారని బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు దాడి ఘటనపై జిల్లా ఎస్పీ వైసీపీ నాయకుడిలా మాట్లాడారన్న టీడీపీ నేత.. తమ అధినేతపై దాడి చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.
ఈ ఘటనలో పోలీసులు గాయపడటం బాధాకరమని బుద్దా వెంకన్న అన్నారు. పోలీస్ అధికార సంఘానికి టీడీపీ నేతలే గుర్తొస్తారా అన్న ఆయన.. పోలీస్ ఉన్నతాధికారులను మంత్రులు బూతులు తిడితే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించాలని జగన్ ఆదేశించారా అన్నారు. పోలీసులకు హక్కుగా రావాల్సిన వేతనాల్లో జగన్ కోత విధిస్తున్నారన్న ఆయన.. వీటిపై పోలీస్ అధికార సంఘానికి బాధలేదా అని ప్రశ్నించారు. డీజీపీ చంద్రబాబుపై పగతో పని చేస్తున్నారని, ప్రజల్లో చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. పోలీసులు తక్షణమే చంద్రబాబుకు, లోకేశ్‌కు భద్రత పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్ మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్న బుద్దా వెంకన్న.. అందుకే ఆయన పోలీసులను అడ్డం పెట్టుకొని కుట్రలు చేస్తున్నారన్నారు. పదవుల కోసం వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్న పోలీసులు.. ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు దాడి చేద్దామా అని ఎదురు చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అధికారుల సంఘం వైసీపీ పోలీస్ సంఘంగా మారిందని బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తనతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా ? అని ఆయన పోలీసులకు సవాల్ విసిరారు. పోలీస్ అధికారులు రెండు రోజులు విధుల్లోకి రాకుండా సెలవుల్లో ఉంటే జగనా.. చంద్రబాబా అనేది తేలిపోతుందన్నారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పని చెబితే తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్న ఆయన.. వైసీపీ నేతలు బూతులు తిట్టినా సలాం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకమని, జగన్ హయాంలో బడుగు, బలహీన వర్గాల వారికి అవమానం జరుగుతోందన్నారు.