తెలంగాణ ఎన్నికల వేళ ఇచ్చిన గ్యారెంటీల్లోని మరో హామీని అమలు చేసేందుకు సర్కార్ రెడీ అయ్యింది. ఈనెల చివరిలోగా అర్హులైన మహిళలకు మహాలక్ష్మీ స్కీం(Mahalakshmi Scheme) కింద రూ. 2500సాయం అందించేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. లోకసభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే ఈ పథకాన్ని అమలు చేసి..వారి ఓటు బ్యాంకును ఆకట్టుకోవచ్చని సర్కార్ భావిస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీ(6 Guarantees)లను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
సీఎంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ఈ గ్యారంటీల అమలుకు సంబంధించిన ముసాయిదాపై సంతకం చేశారు. దీనిలో భాగంగా మొదటి హామీ కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ ప్రయాణం కల్పిస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంతోపాటు స్కీమ్ తో ఇప్పటికే ప్రభుత్వానికి మంచి మైలేజ్ వచ్చింది. దీంతో రెండో గ్యారెంటీ అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో సగానికిపైగా మహిళా ఓటర్లే ఉన్నారు కాబట్టి రూ. 2500 సాయం హామీ అమలు కూడా రాజకీయంగా కలిసివస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.ఇక ఈ స్కీమ్ ను అమలు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు లబ్ది పొందుతారు. ఖజానాపై ఎంత భారం పడుతుంది. మార్గదర్శకాలు ఎలా ఉంటాయి. అర్హులను గుర్తించడం ఎలా..ఇలాంటి అంశాలన్నింటిపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కు రేవంత్ సర్కార్ షాక్.. తెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు!
కర్నాటకలో కాంగ్రెస్ సర్కార్ దీన్ని అమలు చేస్తుండగా..మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ అమల్లో ఉన్న ఇలాంటి స్కీంలను అధ్యయనం చేసి ప్రతినెలా ఎంత అవసరం అవుతుందో నివేదించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. అర్హతలతోపాటు ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలోనికి తీసుకుని ఈనెలాఖరులోగా ఈ స్కీం అమలుకు శ్రీకారం చుట్టేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలనుంచి సమాచారం వస్తోంది.
ఆరు గ్యారెంటీలను 100రోజుల వ్యవధిలో అమలు చేసేందుకు కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే అమలు చేసిన గ్యారెంటీలతో మంచి పేరు వచ్చింది. గ్యారెంటీల అమలుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నా...వాటిలో ఉచ్చులో పడకుండా ఉండాలనే కాంగ్రెస్ నిర్ణయించుకుంది. జనవరి చివరికల్లా ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకుని రూ. 2500 స్కీం ప్రారంభించి అపోహలకు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది.