తెలంగాణకు నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి అతిధులుగా కాంగ్రెస్ పెద్దలను పిలవడానికి రేవంత్ ఈరోజు ఢిల్లీలో వెళ్ళారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు రేవంత్ రెడ్డి. ఆయనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడంతో పాటూ మంత్రి వర్గ కూర్పు, ఇతర ముఖ్య అంశాల గురించి కూడా చర్చించనున్నారని సమాచారం.
ఖర్గేతో పాటూ రేవంత్ రెడ్డి ఈరోజు సోనియా గాంధీ, ప్రియాంకాగాంధీని కూడా కలవనున్నారు. వారిద్దరినీ కూడా రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్నారు. దీని తర్వాత డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ తో కలిసి క్యాబినెట్ కూర్పు మీద రేవంత్ కసరత్తులు చేయనున్నారు. దీనిలో ఆయనతో పాటూ ఉత్తమ్, భట్టి విక్రమార్క కూడా పాల్గొననున్నారు.
Also read:ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన లేఖ.. ఏం రాశారంటే..
ఇక రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ కృతజ్ఞత సభ జరగనుంది. ఇందులో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతలు ధన్యవాదాలు తెలపనున్నారు. దాంతో పాటూ ఆరు గ్యారెంటీలపై కృతజ్ఞత సభలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనికన్నా ముందే క్యాబినెట్ కొలువుదీరాలని అనుకుంటున్నారు. రేపు రేవంత్ రెడ్డితో పాటూ మరికొంత మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని...దానికి కోసమే ఇవాళ చర్చలు జరుగుతాయని చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి రేపు ఉదయం 10.28 గంటలకు హైదరాబాద్ లోని ఎల్బీనగర్ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. ఖర్గే తెలంగాణ సీఎల్పీ భేటీ చేసిన తీర్మానాన్ని పరిశీలించిన తర్వాత రేవంత్‌రెడ్డిని సీఎంగా నియమించాలని నిర్ణయించారని చెప్పారు.