అదరగొట్టే స్టైయిల్.. దిమ్మతిరిగే మ్యానరిజంతో బాక్సాఫీస్‌ను సింగిల్ హ్యాండ్‌తో శాసించగల వన్ అండ్ ఓన్లీ హీరో రజినీకాంత్. 73 ఏళ్ళ వయసులోనూ తన ప్రత్యేకతను నిలుపుకుంటూ స్టార్గా దూసుకుపోతున్నాడు. రజనీకాంత్ ఏం చేసినా సంచలనమే. నవ్వులో వైవిధ్యం, నడకలో వేగం, గొంతులో గాంభీర్యం, మ్యానరిజంలో మాస్ అప్పియరెన్స్ అన్నీ కలిసి ఆయన్ని సూపర్ స్టార్‌ని చేశాయి. రజినీకాంత్ సిగరెట్ వెలిగించినా, సెల్యూట్ చేసినా…కోట్ వేసినా.. అదొక స్టైల్..అదొక స్పెషల్ మ్యానరిజం. అందుకే మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అతి కొద్ది నటుల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు.
కథలకు తగ్గట్టు రజనీ చేస్తాడా...రజనీ కోసం కథలు పుడతాయా అన్నట్టు ఉంటాయి ఆయన సినిమాలు అన్నీ. ఇక సినిమాల్లో డైలాగ్ లు మాత్రం రజనీ కోసమే రాస్తారు. రచయితలు రాయడం ఒక ఎత్తు...వాటిని చెప్పడం మరొక ఎత్తు. అందులో దిట్ట రజనీ. తన సినిమాలతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే రజినీకాంత్..1950 డిసెంబర్ 12న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. మొదట బెంగుళూరు ట్రాన్స్ పోర్టులో కండక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. దాంతో పాటు అప్పుడప్పుడు స్టేజీల మీద నాటకాలు కూడా వేస్తుండేవాడు. అలా దర్శక దిగ్గజం కే.బాలచందర్ దృష్టిలో పడ్డారు. ఆయన దర్శకత్వంలో మొదటిసారి 1975లో తెరకెక్కిన అపూర్వ రాగంగళ్ సినిమాలో ప్రతినాయకుడిగా రజినీకాంత్ అదరగొట్టేసారు.
సినీ ఇండస్ట్రీకి రజనీకాంత్ ను బహుమతిగా ఇచ్చింది కె.బాలచందర్. అయితే రజనీ మొదట్లో చేసిన రోల్స్ అన్నీ నెగెటివ్ లేదా సెకండ్ హీరోగా. ఆయన్ని పూర్తిస్థాయి పాజిటివ్ హీరోగా మార్చిన డైరెక్టర్ మాత్రం ఎస్.పి.ముత్తురామన్. తెలుగులో చిలకమ్మ చెప్పింది సినిమాతో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు రజనీకాంత్. మొదటి 25 సినిమాల వరకు రజనీ కాంత్ సోలో హీరోగా చేయలేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ అన్ని భాషల్లోనూ సెకండ్ హీరోగానే చేశారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టింది మాత్రం 1980లో వచ్చిన భైరవి అనే తమిళ సినిమా. దీని తరువాత రజనీ కాంత్ ను ఆపేవాడే పుట్టలేదు ఇప్పటి వరకు.
ప్రేక్షకుల్లో రజినీకాంత్‌కు అంత క్రేజ్ రావడానికి కారణం ఆయన స్టైయిల్. ఆయన నటించిన సినిమాలు అంత పాపులార్ కావడానికి కారణం కూడా ఇదే. సిగరెట్ వెలిగించే స్టైల్… సెల్యూట్ చేసే స్టైయిల్ ఆయన్ని మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేశాయి. ఇక రజినీకాంత్ స్టైల్, మేనరిజమ్ పూర్తిస్థాయిలో ఆవిష్కరించిన చిత్రం ‘బాషా’. ఈ సినిమాలో ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే డైలాగ్స్ ఇప్పటికి ప్రేక్షకులు మరిచిపోలేదు. బాషా మూవీతో రజినీకాంత్..తెలుగులో ఇక్కడి స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. దీని తర్వాత రజనీ చేసిన ఒక్కో సినిమా ఒక్కో మాస్టర్ పీస్. దళపతి, ముత్తు, పెదరాయుడు, చంద్రముఖి, శివాజీ, రోబో ఇలా అన్ని సినిమాలూ. పైగా ఇలాంటి సినిమాలు చేస్తే రజనీనే చేయాలి అన్నట్టు కూడా ఉంటాయి.
రజినీకాంత్ సినీకెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. తమిళ్‌లో ఆరు సార్లు ఉత్తమ నటుడి అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, కేంద్రం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. రజినీకాంత్‌లో ఆధ్మాత్మిక భావాలు కూడా ఎక్కువ. ఖాళీ సమయాల్లో హిమాలయాకు వెళుతూ సేద తీరుతూ ఉంటారు. ఏడాది ఒక్క సినిమానే చేస్తారు రజనీకాంత్..కానీ అది ఎప్పటికీ నిలిచిపోయేలా...ప్రేక్షకులకు గుర్తింపోయేలా చేస్తారు. అదీ ఆయన ప్రత్యేకత.