Rahul Gandhi: 20, 30 ఏళ్ళుగా ఉన్న ఒత్తిడి నుంచి తాను బయటపడ్డానని అంటున్నారు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. గత వారం రాహుల్ కశ్మీర్‌లో పర్యటించారు. అప్పుడు అక్కడ అమ్మాయిలతో ఆయన కాసేపు ముచ్చటించారు. దీని తాలూకా వీడియోను ఈరోజు రాహుల్ తన యూట్యూబ్, ఎక్స్ ఖతాల్లో అప్ లోడ్ చేశారు.
ఇప్పుడు కష్టం..
రాహుల్ గాంధీ యువతులతో మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ అమ్మాయిలు పెళ్ళి గురించి ప్రశ్నలు వేశారు. దీనికి సమాధానం చెబుతూ ఆయన...ఇప్పుడు తాను పెళ్ళికి ప్లాన్ చేయడం లేదని..20, 30 ఏళ్ల నుంచి ఉన్న ఆ ఒత్తిడిని తాను అధిగమించానని చెప్పుకొచ్చారు. పెళ్ళి జరిగితే మంచిదేనని..కానీ ఇప్పుడు ఇక కష్టమని అన్నారు. ఒకవేళ ఏదైనా జరిగి తనకు పెళ్ళి అయితే కనుక తప్పకుండా కశ్మీర్ యువతులను ఆహ్వానిస్తానని రాహుల్ హామీ ఇచ్చారు.
ఆయన ఎవరి మాటా వినరు..
ఇక కశ్మీలో ప్రస్తుత పరిస్థితులు గురించి రాహుల్ మాట్లాడుతూ..జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలనే డిమాండ్‌ను ఆయన మరోసారి లేవనెత్తారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఢిల్లీ నుంచి నడిపించడం వల్ల ప్రయోజనం లేదని అన్నారు. భారతీయ చరిత్రలో ఒక రాష్ట్రానికి పూర్తి రాష్ట్ర హోదాను తొలగించడం ఇదే మొదటిసారి కామెంట్ చేశారు రాహుల్ గాంధీ. ఈ విధానం తనకు నచ్చలేదని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. అలాగే ప్రధాని మోదీ గురించి ప్రశ్నించగా..ఆయన ఎవరి మాటా వినరని...అదే ఆయన మీద నా కంప్లైంట్ అని చెప్పుకొచ్చారు.