Rahul Gandhi: త్వరలో జరగబోయే మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభ ఎన్నికల్లో విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతర్గత విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పని చేయాలని సూచించారని చెప్పాయి. త్వరలో మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్ రాష్ట్రాలతో పాటు జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, మిత్ర పక్షాలతో కలిసి ఎన్నికల్లో పని చేయాలని రాహుల్‌గాంధీ, హస్తం పార్టీ నేతలకు సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇటీవల సమీక్షించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హస్తం పార్టీలో సీనియర్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు విషయమై రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.