మహారాష్ట్రలో మళ్లీ రిజర్వేషన్‌కు సంబంధించిన వివాదాలు రాజుకున్నాయి. జల్నా జిల్లాలోని ఓ ఆర్టీసీ బస్సుకు ఆందోళనకారులు నిప్పంటించడం కలకలం రేపింది. మరాఠా ఆందోళనకారులు బస్సును తగులబెట్టినట్లు ఆరోపిస్తూ ఎంఎస్‌ఆర్టీసీ అంబాద్ డిపో మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శాంతిభద్రతలను అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. జల్నాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అటు ఎంఎస్‌ఆర్టీసీ కూడా స్థానికంగా బస్సు సేవలను ఆపేసింది.
Also Read: పాకిస్థాన్‌కు ఆ నది నీళ్లు కట్.. ఇకనుంచి మనకే
జల్నాతో పాటు , ఛత్రపతి శంభాజీనగర్, బీడ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి. అలాగే ముందుజాగ్రత్త చర్యగా ఈ మూడు జిల్లాల సరిహద్దులను కూడా మూసివేశారు. అంతర్వాలి సారథి గ్రామంలో ఆందోళన చేస్తున్న మరాఠా కోటా ఉద్యమనేత మనోజ్ జరంగే.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటికి ర్యాలీగా వెళ్తానని ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఈ ఆంక్షలు అమలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలాఉండగా.. ఫిబ్రవరిలో మహారాష్ట్ర అసెంబ్లీలో మరాఠా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టగా.. దీనికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. దీని ప్రకారం చూసుకుంటే మరాఠాలకు 50 శాతం పరిమితిని మించి అదనంగా 10 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నారు. ఫిబ్రవరి 20న అసెంబ్లీలో కోటా బిల్లు ఆమోదం పొందిన అనంతరం.. మనోజ్ జరంగే పాటిల్ దీక్షను ఆపలేదు. అంతేకాదు ఈ ఆర్డినెన్స్ నోటిఫికేషన్‌ను రెండ్రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 24న రాష్ట్రంలో మరో ఉద్యమం మొదలైంది. అయితే మరాఠా కమ్యూనిటికి అందిస్తానన్న రిజర్వేషన్ సంతృప్తికరంగా లేదని మనోజ్ జరంగే అన్నారు. అలాగే కోటా బిల్లు ఆమోదం పొందిన తర్వాత తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. దీనివెనక డిప్యూటీ సీఎం ఫఢ్నవీస్ ఉన్నారని.. ముంబయిలోని ఆయన ఇంటికి ర్యాలీగా వెళ్తానని జారంగే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారంపై మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: జయలలిత నగలు, స్థిరాస్తుల వేలం.. ఎన్నికోట్లు రానున్నాయంటే!