చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శుక్రవారం పుంగనూరులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో.. నియోజకవర్గ వైసీపీ నేతలు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు. నల్లజెండాలను, నల్ల బెలూన్లను ఎగురవేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాయలసీమకు మంజూరైన ఎయిమ్స్ వంటి కొన్ని భారీ ప్రాజెక్టులను సైతం అమరావతికి తరలించాడంటూ ధ్వజమెత్తారు. పుంగనూరులో ప్రాజెక్టులు నిలిచిపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణమని ఆరోపించారు.
రెండు నీటి ప్రాజెక్టులను పుంగనూరులో ఏర్పాటు చేయకుండా కోర్టు స్టే తెచ్చి నిలిపివేశారని విమర్శించారు. రాయలసీమలో ఒక్క నీటి ప్రాజెక్టుకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేయలేదని, వాటిని ప్రారంభించిన దాఖలాలు కూడా లేవంటూ ధ్వజమెత్తారు. ఈ ఘటనలతో పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో పుంగనూరులో 500 మంది పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని.. పోలీసులకు రెండు పార్టీ నాయకులు, కేడర్ సహకరించాలని ఎస్పీ రిశాంత్ రెడ్డి కోరారు.