తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు అన్ని కూడా ప్రచారంలో జోరు పెంచారు. ఇప్పటికే బీఆర్‌ఎస్(BRS), కాంగ్రెస్(Congress) , బీజేపీ (BJP) వాళ్లంతా బహిరంగ సభలు నిర్వహించి వారి ఎన్నికల ప్రచారాలను పెంచుతున్నారు. కాంగ్రెస్ వారు అయితే..రాహుల్, ప్రియాంక (Rahul Gandhi) లను రాష్ట్రానికి ఆహ్వానించి బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి తమ పార్టీ కార్యకలాపాలను లోతుగా తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే బీజేపీ వారు కూడా ఇప్పటికే పార్టీ పెద్దలు అయిన అమిత్ షా , జేపీ నడ్డా లను రాష్ట్రానికి తీసుకుని వచ్చి బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఇప్పటికే పలుమార్లు ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే బీజేపీ వారు '' బీసీ ఆత్మగౌరవ సభ'' పేరుతో మంగళవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ (Narendra Modi) హాజరుకానున్నారు. బీజేపీని రాష్ట్రంలో గెలిపిస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని (BC CM) చేస్తామని బీజేపీ వర్గాలు ప్రకటించడంతో ..పార్టీ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. దీంతో ఈ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి.
ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా హాజరుకానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ బహిరంగ సభ ఏర్పాట్లను ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు అయిన కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ , లక్ష్మణ్ పరిశీలించారు. నేటి సభలో మోదీ కూడా బీసీ ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకుని వస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత రాష్ట్రానికి ప్రధాని రావడం ఇదే తొలిసారి. మోదీ అక్టోబర్ లో రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో బీజేపీ నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈరోజే కాకుండా మోదీ మరోసారి అంటే నవంబర్ 11 ను కూడా రాష్ట్రానికి రానున్నారు.
అప్పుడు ఆయన సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ఎస్సీ సామాజిక వర్గాల సమావేశానికి హాజరవుతారు. ఎన్నికలు ఈ నెలాఖరుకు జరగనున్న విషయం తెలిసిందే. మోదీ సభ జరుగుతున్న క్రమంలో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (traffic Rules) నిర్వహించారు.
ఎల్బీ స్టేడియం పరిసరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా నిబంధనలు విధించారు. ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలకు అనుమతి లేదు. నాంపల్లి, రవీంద్ర భారతి వైపు ట్రాఫిక్ ను మళ్లిస్తారు. అలాగే అబిడ్స్, గన్ ఫౌండ్రీ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు కూడా వాహనాలకు అనుమతి లేదు.
వీటిని ఎస్బీఐ గన్ ఫౌండ్రీ నుంచి చాపల్ రోడ్డులోకి మళ్లిస్తారు.అలాగే ట్యాంక్ బండ్ నుంచి బషీర్ బాగ్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ జంక్షన్ వద్ద హిమాయత్ నగర్ వైపునకు మళ్లిస్తారు.
మంగళవారం సాయంత్రం 5.05 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. సభ జరగనున్న ఎల్బీ స్టేడియానికి 5.25 గంటలకు చేరుకుంటారు. 5.30 నుంచి 6.10 గంటల వరకు బహిరంగసభలో పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం 6.15 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ పయనమవుతారని పార్టీ వర్గాలు అధికారిక షెడ్యూల్ విడుదల చేశాయి.
Also read: ముందు అవమానం.. తర్వాత స్థానం.. రాములమ్మ, రఘునందన్‌కు స్టార్ క్యాంపెయినర్లగా చోటు!