Pawan Kalyan Birthday: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటేనే అభిమానులకు ఓ వైబ్రేషన్. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతారు. సినిమా హిట్టా? ఫట్టా? అని పట్టించుకోరు.. వెండితెరపై తమ అభిమాన హీరోను చూస్తే చాలంటూ సంబరపడిపోతుంటారు. ఇక కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అంటూ బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తుంటారు. తమ ఆరాధ్య హీరో, నాయకుడైన పవన్‌కల్యాణ్‌ను ఒక్కసారైనా ప్రత్యక్షంగా కలవాలని, కళ్లారా చూడాలని పరితపిస్తుంటారు. అదే పవన్ బర్త్‌డే వస్తుందంటే చాలు నెల రోజుల ముందే హడావిడి చేస్తుంటారు. సోషల్ మీడియాలో అయితే రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక బర్త్‌డే రోజు అయితే ఇటు సంబరాలతో పాటు అటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు.
1971 సెప్టెంబర్ 2వ తేదీన కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లలో ఆఖరి సంతానంగా పవన్ కల్యాణ్ జన్మించారు. చివరి కుమారుడు కావడంతో చిన్నప్పటి నుంచి గారాభంగా పెరిగారు. తనకు ఊహ వచ్చే నాటికి తన పెద్దన్న చిరంజీవి.. సినిమాల్లో హీరోగా సత్తా చాటారు. తమ్ముడి లాగా కాకుండా సొంత కొడుకు లాగా చిరు దంపతులు పవన్‌ను పెంచారు. చిన్న వయసు నుంచే విలక్షణమైన వ్యక్తిత్వంతో పెరిగిన పవన్.. చదువుపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయారు. పూర్తిగా సినిమా వాతారణం ఉన్న ఇంట్లో పెరిగినా సినిమాలపై మక్కువ పెంచుకోలేదు.
విప్లవ భావజాలం పట్ల ఆకర్షితులైన కల్యాణ్.. సమాజానికి దూరంగా బతకాలని అనుకున్నారు. అయితే అనుకోని పరిస్థితుల వల్ల అయిష్టంగానే సినిమాల్లోకి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా అరంగేట్రం చేసినా తన స్టైల్, యాటిట్యూడ్‌తో అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్‌డమ్ దక్కించుకున్నారు. తొలిప్రేమ (TholiPrema), తమ్ముడు (Thammudu), బద్రి (Badri), ఖుషీ (Kushi) వంటి మూవీలతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుని పవర్‌స్టార్‌గా ఎదిగారు.
తర్వాత పదేళ్ల పాటు తన ఇమేజ్‌కు తగ్గ హిట్ పడకపోయినా.. గబ్బర్‌సింగ్ (Gabbar Singh)తో ఇండస్ట్రీ హిట్ కొట్టి బాక్సాఫీస్‌ను షేక్ ఆడించారు. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమా మొత్తం విడుదలకు ముందే పైరసీ అయినా సరే థియేటర్లలో బొమ్మ దద్దరిల్లిపోయింది. రికార్డు కలెక్షన్లతో అదరగొట్టింది. విడుదలకు ముందే సినిమా మొత్తం పైరసీ అయినా ఇండస్ట్రీ హిట్ కొట్టిందంటే అది ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే సాధ్యమని అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు.
ఇక సినిమాల్లో వరుస హిట్లతో నంబర్‌వన్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే సమాజం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాష్ట్ర విభజన సమయంలో జనసేన పార్టీ(Janasena Party)తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ అక్కడ కూడా సంచలనాలు నమోదుచేశాడు. 2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా తెలుగుదేశం, బీజేపీతో పొత్తు పెట్టుకుని కీలక పాత్ర పోషించారు. అనంతరం ప్రజల సమస్యలపై తనదైన శైలిలో పోరాడుతూ ముందుకు సాగారు. ఇక 2019లో టీడీపీ, బీజేపీ పొత్తు నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్.. రెండింట్లోనూ ఓడిపోయారు. అయినా కానీ వెకడుగు వేయకుండా వైసీపీ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తూ క్యాడర్‌లో ఉత్సాహం నింపుతూ వస్తున్నారు.
ఇక వారాహి యాత్ర(Varahi Yatra)తో ప్రజల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్.. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ జనాల్లో మంచి ఫాలోయింగ్ సంపాందించారు. అర్థవంతమైన విమర్శలు, ప్రభుత్వం వైఫల్యాలు ఎత్తి చూపుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్‌తో పాటు మంత్రుల అవినీతిని ప్రశ్నిస్తూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ అవ్వడంతో పాటు అసెంబ్లీలో అడుగుపెట్టడమే లక్ష్యంగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతూ ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. ఎప్పటికైనా జనసేన ప్రభుత్వం స్థాపించే దిశగా తన అడుగులు ముందుకు వేస్తూ బలమైన రాజకీయ నేతగా తనను తాను తీర్చిదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారు.