రాహుల్ గాంధీ బోధన్ రాకను నిరసిస్తూ వెలిసిన పోస్టర్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రాత్రికి రాత్రే నిజామాబాద్, బోధన్ లో గోడలకు పోస్టర్లు ప్రత్యక్షం అయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ నిజామాబాద్ లోని బోధన్ లో ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. గోడ మీద ఉన్న పోస్టర్లలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. బలిదానాల బాధ్యత కాంగ్రెస్ దే... మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ అని పోస్టర్లలో రాసి ఉంది. దీనికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందే... ముక్కు నేలకు రాయాల్సిందేనని అంటూ డిమాండ్ చేశారు.
Also Read:ఇవాళ అయినా టన్నెల్ నుంచి కార్మికులు బయటకు వస్తారా?
అంతేకాదు కర్నాటకలో కాంగ్రెస్ పాలన బాగోలేదంటూ కూడా పోస్టర్లలో ఉంది. కర్నాటకలో కరెంటు కష్టాలు, నిరుద్యోగాన్ని ఎత్తి చూపిస్తూ..కాంగ్రెస్ ని నిరసిస్తూ రాతలు కనిపించాయి. దాంతో పాటూ బళ్లారిలో జీన్స్ పరిశ్రమలకు విద్యుత్తు కోతలపై పత్రికల్లో వచ్చిన కథనాలు సైతం పోస్టర్లలో కనిపించాయి. కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి కరెంటులేక అల్లాడుతున్న కర్నాటక అని విమర్శ రాసి ఉంది. కర్నాటకలో ఉద్యోగాలు కాదు ఉరితాళ్లే..ఇలాంటి కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరామా అని ఉన్న ప్రశ్నలు పోస్టర్లలో కనిపించాయి.
అయితే ఈ పోస్టర్లను ఎవరు తయారు చేయించారు, ఎలా వచ్చాయి అని మాత్రం తెలియలేదు. దీని మీద కాంగ్రెస్ వర్గాలు ఎలాంటి యాక్షన్ తీసుకోనున్నాయో తెలియాల్సి ఉంది.
Also Read:మళ్ళీ సొంతగూడు ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా?