Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్లపై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణానికి మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించనుంది రేవంత్ సర్కార్. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు అందించనుంది. ఇంటి నిర్మాణం కనీసం 400 చదరపు అడుగుల్లో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో రేషన్ కార్డులు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని అధికారులతో మంత్రి పొంగులేటి అన్నారు. ఇటీవల ఆరు గ్యారెంటీల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం కింద దరఖాస్తులు తీసుకున్న విషయం తెలిసిందే.
ALSO READ: రాజ్యాంగం ప్రమాదంలో ఉంది.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
82 లక్షల దరఖాస్తులు?
ప్రజాపాలన కార్యక్రమంలో ఎక్కువ దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం 95, 235 దరఖాస్తులు వచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వివరించింది. అయితే అర్హులు అందరికి ఇళ్లు ఇవ్వాలని భావిస్తున్న రేవంత్ సర్కార్ కు ఇది పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదికి 4 లక్షల 16వేల 500 ఇళ్లు నిర్మించాలని కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ప్రతి నియోజకవర్గంలో 3, 500 ఇళ్లు నిర్మిస్తామని అసెంబ్లీ లోప్రభుత్వం ప్రకటించింది. 95, 235 లక్షల మందిలో కనీసం 50 లక్షల మంది అర్హులు అనుకుంటే.. ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మించినా పదేళ్లు పట్టే అవకాశం ఉందని అంచనా. ఐదేళ్లలోనే లబ్ధిదారులందరికీ ఇళ్లు అసాధ్యం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 95, 235 లక్షల దరఖాస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు ఎవరు?, లబ్ధి దారుల ఎంపిక ఎలా ఉండబోతోంది?, నియోజకవర్గంలో 3,500 మందిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు? ఇలా ఇందిరమ్మ ఇళ్లపై జనాల్లో ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.