Mahesh Babu-Jr.NTR: మహేష్ బాబు-జూ.ఎన్టీఆర్ కుటుంబాల మధ్య రాజకీయ రగడ.. ఎందుకో తెలుసా?

మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడు-జూ.ఎన్ఠీఆర్ నందమూరి నట వారసుడు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం. వెండితెర స్టోరీ ఇదే. కానీ, పొలిటికల్ గా కథ వేరు. ఈ రెండు కుటుంబాల రాజకీయ శత్రుత్వం ఇప్పటిది కాదు.. దశాబ్దాల చరిత్ర తెలియాలంటే ఈ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాల్సిందే.

Mahesh Babu-Jr.NTR: మహేష్ బాబు-జూ.ఎన్టీఆర్ కుటుంబాల మధ్య రాజకీయ రగడ.. ఎందుకో తెలుసా?
New Update

Movies and Politics: సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడు మహేష్ బాబు.. నందమూరి నట వారసుడు జూ.ఎన్ఠీఆర్ ఇద్దరికీ తెలుగునాట అభిమానుల అందండలు కావలసినంత ఉన్నాయి. అప్పట్లో కృష్ణ-ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్.. ఇప్పుడు వీరికి కూడా ఉంది. సినిమాల్లో ఇద్దరూ ఒక రేంజ్ లో ఉన్నారు. కానీ.. పొలిటికల్ గా మాత్రం ఇద్దరి దారి వేరు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా.. కుటుంబ నేపథ్యంలో రాజకీయాల విషయానికి వచ్చేసరికి ఇద్దరి మధ్య పెద్ద గ్యాప్ ఉంది. అసలు ఘట్టమనేని-నందమూరి కుటుంబాల మధ్య ఈ రాజకీయ వైరం ఎందుకు? రాజకీయాల్లో శాశ్వతం కాని స్నేహం..శత్రుత్వం.. లెక్కలు ఈ కుటుంబాల మధ్య ఎందుకు పనిచేయలేదు? ఎన్ఠీఆర్-కృష్ణ రాజకీయంగా శాశ్వత శత్రువులుగా ఎందుకు మిగిలిపోయారు? ప్రస్తుత ఎన్నికల తరుణంలో ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఆ జవాబులు తెలియాలంటే.. ఈ ఫ్లాష్-బ్యాక్ స్టోరీ మొత్తం చదవాల్సిందే. 

NTR and Krishna

 తెలుగు సినిమా అనగానే ఎన్ఠీఆర్.. ఏఎన్నార్ లతో పాటు కృష్ణ పేరు కూడా ఠక్కున స్ఫూరిస్తుంది. దశాబ్దాల పాటు తెలుగు సినిమాపై సూపర్ స్టార్ గా వెలిగిన కృష్ణది విభిన్నమైన శైలి. అది నటనే కావచ్చు.. వ్యక్తిత్వమే కావచ్చు. సాహసోపేతంగా వ్యవహరించడంలో కృష్ణ తరువాతే ఎవరైనా తెలుగు ఇండస్ట్రీలో అనే గొప్ప పేరు కూడా ఆయనకు ఉంది. ఎన్ఠీఆర్ - కృష్ణల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. ఇద్దరూ తొలిరోజుల్లో అన్నదమ్ముల్లా మెలిగేవారు. కానీ, ఇద్దరి మధ్యలో రెండుసార్లు వచ్చిన వివాదాలు పెద్ద ఎత్తున అభిమానుల్లో కలకలం రేపడమే కాకుండా.. అభిమానుల మధ్యలో కూడా పెద్ద అడ్డు గోడ కట్టాయి. మొదటిసారి ఇద్దరి మధ్య వచ్చిన వివాదం సినిమాలకు సంబంధించింది. అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో ఎన్టీఆర్ - కృష్ణ మధ్యలో పెద్ద చిచ్చు రేగింది. నిజానికి ఆ పాత్ర తానూ చేయాలని ఉవ్విళ్ళూరారు ఎన్టీఆర్. కానీ, కృష్ణ దానిని సాధ్యం చేశారు. ఆ సినిమా చేయవద్దని చెప్పినా వినకుండా కృష్ణ చేయడంతో షూటింగ్ టైమ్ లో ఎన్టీఆర్ కృష్ణపై కోపగించి.. మాట్లాడటం మానేశారు. కానీ, సినిమా విడుదల తరువాత ఆయనే స్వయంగా ఈ సినిమా కృష్ణ అద్భుతంగా చేశాడంటూ అభినందించి ఆలింగనం చేసుకున్నారు. టీ కప్పులో తుఫానులా మొదటి వివాదం సమసిపోయింది. తరువాత కృష్ణ-ఎన్టీఆర్ మధ్య మరింత స్నేహ బంధం.. సోదర భావం పెరిగాయి. ఇండస్ట్రీలో ఇద్దరి స్నేహం చాలా బాగా కొనసాగింది. 

NTR and Krishna

రాజకీయాల్లో..  
ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించారు. తొమ్మిది నెలల్లోనే అధికారం సాధించారు. దీనివెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ కు వచ్చిన అద్భుతమైన సహకారం కూడా ఉంది. అందులోనూ సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కూడా తక్కువ కాదు. ఎన్ఠీఆర్ ముఖ్యమంత్రి కావాలని కృష్ణ బలంగా కోరుకున్నారు. ఆయన 200 వ సినిమా ఈనాడు ఎన్టీఆర్ రాజకీయ ఆలోచనల ఆధారంగానే రూపుదిద్దుకుంది. ఎన్టీఆర్ భావాలను ఆ సినిమా ద్వారా ప్రజల ముందు ఆవిష్కరించారు కృష్ణ. అలా ఎన్ఠీఆర్ తో తనకు ఉన్న బంధాన్ని కొనసాగించారు. పరోక్షంగా ఎన్టీఆర్ రాజకీయాలకు సపోర్ట్ గా నిలిచినా కృష్ణ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా.. ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల జోలికి పోలేదు. అంతకు ముందు 1970ల్లో జై ఆంధ్రా ఉద్యమానికి గట్టి మద్దతు ఇచ్చిన కృష్ణ.. ఆ తరువాత మళ్ళీ రాజకీయాల మాట ఎత్తలేదు. 

Ntr political entry

ఒక్క యాడ్ మొత్తం మార్చేసింది.. 
ఎన్టీఆర్ టీడీపీ పార్టీతో సృష్టించిన సంచలనం అంతా.. ఇంతా కాదు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న సంచలన నిర్ణయాలు తక్కువ కాదు. అప్పటి వరకూ రాజకీయాలు తెలీని సాధారణ ప్రజలకు రాజకీయాలను.. దగ్గరకు చేర్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఇదిలా ఉంటే, 1984లో టీడీపీని.. రాష్ట్రాన్ని.. రాష్ట్ర రాజకీయాల్ని పెద్ద కుదుపు కుదిపిన సంఘటన జరిగింది. ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేసి.. దొడ్డిదారిన నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిని చేసేసింది కాంగ్రెస్ పార్టీ. దానివెనుక చాలా పెద్ద కథ నడిచింది. సరిగ్గా ఆ సమయంలో.. అంటే, నాదెండ్ల ముఖ్యమంత్రి అయిన వెంటనే.. పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్ ఒకటి నాదెండ్ల భాస్కర రావును అభినందిస్తూ కృష్ణ ఇచ్చారు. ఆ యాడ్ ఎన్టీఆర్-కృష్ణ మధ్య తీవ్ర వివాదాన్ని రేపింది. ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. ఎంతంటే.. తరువాత ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయినా సరే.. ఇద్దరి మధ్యలో సయోధ్య కుదరలేదు. తరువాత కాలంలో..  రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణ రాజకీయాల్లోకి వచ్చి.. ప్రత్యక్షంగా ఎన్నికల్లో నిలబడటానికి దోహదపడేంతగా ఆ వివాదం దారితీసింది. 

కాంగ్రెస్ పార్టీలోకి.. 
ఎన్టీఆర్ మీద ద్వేషమో.. తానూ రాజకీయాల్లో వెలగాలని అభిలాషో తెలీదు కానీ, కృష్ణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కృష్ణ-ఎన్టీఆర్ మధ్య ఉన్న విబేధాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బాగా తెలుసు. పైగా ఏపీలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలంటే.. ఎన్టీఆర్ ఛరిష్మాను ఎదుర్కోవాలంటే, అందుకు ధీటైన వ్యక్తి కృష్ణ ఒక్కరే అని భావించారు కాంగ్రెస్ పెద్దలు. ఇందిరాగాంధీ కృష్ణను రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. అవి ఫలించలేదు. కానీ, కాంగ్రెస్ మాత్రం కృష్ణ కోసం చూస్తూనే ఉంది. అకస్మాత్తుగా ఇందిరా గాంధీ ముష్కరుల తూటాలకు బలి అయ్యారు. అప్పుడు ఆమె అంత్యక్రియలకు కృష్ణ హాజరు అయ్యారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ.. కృష్ణను రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం గట్టిగా చేశారు. దీంతో కృష్ణ పొలిటికల్ ఎంట్రీ కాంగ్రెస్ పార్టీలో జరిగిపోయింది. అది 1984వ సంవత్సరం. 

Krishna in Politics

ఎంపీగా పోటీ..
తరువాత 1989లో జరిగిన ఎన్నికల్లో ఏలూరు నుంచి కృష్ణ కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. టీడీపీ తరఫున పోటీ చేసిన బోళ్ల బుల్లిరామయ్యపై కృష్ణ 71,407  ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల సమయంలో కృష్ణ ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారమే లేపాయి. ప్రజల్లో బాగా వెళ్లాయి. ‘’దేశం కోసం ఆస్తులను.. జీవితాలనూ త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ - రాజీవ్ గాంధీకి ఓటేస్తారా/ పిల్లికి కూడా బిచ్చం పెట్టని ఎన్టీఆర్ కు ఓటు వేస్తారా?’’ ఆయన చేసిన ప్రచారం ప్రజలను ఆకట్టుకుంది. కాంగ్రెస్ పార్టీని దాదాపుగా కృష్ణ ఏపీలో ఓన్  చేసుకున్నారనే చెప్పవచ్చు. అయితే, అది కాంగ్రెస్ పార్టీ.. అందులో కృష్ణ లాంటి వారు ఇమడటం చాలా కష్టం. ఆ విషయం తొందరలోనే అర్థం అయింది ప్రజలకు. 1991లో మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి గుంటూరు స్థానం ఎంచుకున్నారు కృష్ణ. కానీ, కాంగ్రెస్ అధిష్టానం ఏలూరు నుంచే ఆయనను బరిలోకి దించింది. ఆ ఎన్నికల్లో అదే బోళ్ల బుల్లిరామయ్య చేతిలో 47,655 ఓట్ల తేడాతో కృష్ణ పరాజయం పాలయ్యారు. 

Also Read: శామ్ పిట్రోడా వివాదస్పద వ్యాఖ్యలు దుమారం.. అసలు ఎవరీయన ?

రాజకీయాలకు దూరం..
ఎన్టీఆర్ తో విబేధాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈలోపు రాజీవ్ గాంధీ ఆకస్మిక మరణం కృష్ణకు కాంగ్రెస్ తో అనుబంధాన్ని దూరం చేసే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు కూడా కృష్ణకు చికాకు పుట్టించాయి. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా జరిగారు కృష్ణ. సినిమాల్లో ఎన్టీఆర్ తో సై అంటే సై అనేస్థాయిలో నిలబడ్డ కృష్ణ.. రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్దగా ఎదగలేక పోయారని చెప్పవచ్చు. 

ఎన్టీఆర్ టార్గెట్ గా సినిమాలు.. 
కృష్ణ అంటేనే సాహసం.. ఎన్టీఆర్ తో విబేధాలు పెరిగి.. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన కృష్ణ.. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా సినిమాలు తీశారు. ఎన్టీఆర్ పాలన.. విధానాలను వ్యంగ్యంగా చూపిస్తూ మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి లాంటి సినిమాలు తీశారు. ఇక నా పిలుపే ప్రభంజనం పేరుతో కృష్ణ తీసిన సినిమా సంచలంగా మారింది. రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. అందులో ఎన్టీఆర్, ఆయన అల్లుళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబును పోలిన పాత్రలు పెట్టి.. డీసీపీగా కృష్ణ హీరోగా కనిపించారు. రాజకీయంగా తిరుగుబాటు వచ్చినట్టు సినిమా క్లైమాక్స్ ఉంటుంది. ఈ సినిమాతో కృష్ణ-ఎన్టీఆర్ మధ్య దూరం మరింత పెరిగిపోయింది. తరువాత ఎప్పుడూ ఇద్దరూ ఒక్కటయ్యే ప్రయత్నాలు జరగలేదు. 

రాళ్లతో దాడి.. 
ఒక సందర్భంలో కృష్ణపై రాళ్లదాడి జరిగింది. అప్పుడు కృష్ణ ఘాటుగా టీడీపీని, ఎన్ఠీఆర్ ను విమర్శించారు. దీంతో పలు పత్రికల్లో కృష్ణకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం జరిగింది. కృష్ణను విమర్శిస్తూ రాజకీయ కథనాలు వచ్చాయి. అప్పుడు కృష్ణ కూడా అదేస్థాయిలో ఆ మీడియా అధినేతలను, ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ ఎదురుదాడి చేశారు. ఈ సంఘటన ఎన్టీఆర్-కృష్ణ సంబంధాలపై పెద్ద ప్రభావమే చూపించింది. అది రెండు కుటుంబాల రాజకీయ దారులను ఎప్పటికీ కాలవనీయనంత దూరంగా చేసింది. 

డెస్టినీ.. దానిని ఎవరూ ఊహించలేరు. తెలుగు సినిమా తెరపై అన్నదమ్ములుగా వెలిగిన ఇద్దరు నటులు.. చిన్న కారణంతో చెరోదారి పట్టారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరని చెబుతారు. కానీ, ఎన్టీఆర్-కృష్ణ విబేధాలు మాత్రం వారు ఈ లోకాన్ని వదిలిపోయేంత వరకూ కూడా శాశ్వతంగానే ఉండిపోయాయి. ఇప్పటికీ తెలుగు రాజకీయ చరిత్రలో  కృష్ణ ప్రస్థానం.. ఎన్టీఆర్ తో విబేధాలు.. ఒక పేజీగా నిలిచిపోయాయి.

#tollywood #tdp #superstar-krishna #sr-ntr #ap-politics #congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి