Delhi Police hit by SUV: ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ లో దారుణం చోటుచేసుకుంది. అక్టోబర్ 24న జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడ పోలీసులు పికెట్ పెట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన SUV పోలీసులను ఢీకొట్టి అంతే వేగంగా వెళ్ళిపోయింది. కారు పికెట్ ను ఢీకొట్టడంతో పోలీసు సిబ్బంది గాలిలో ఎగిరి చాలా అడుగుల దూరంలో పడ్డారు. అందులో రవి సింగ్ అనే కానిస్టేబుల్ ను ఆ కారు కొంత దూరం ఈడ్చుకుని వెళ్లినట్లు కూడా కనిపిస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ రవి సింగ్ ను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. అతని ప్రాణాలకు ఏమీ ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు.
Also read:సెమీస్ రేస్ ఒత్తిడిలో పాక్.. అగ్రస్థానం కోసం తలపడుతున్న సౌత్ ఆఫ్రికా
అక్టోబర్ 24 రాత్రి ఒంటిగంటకు ఈ సంఘటన జరిగింది. పోలీసును ఢీకొట్టిన తర్వాత.. ఆ ఎస్యూవీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ.. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే స్పందించి.. అతడిని సకాలంలో పట్టుకుని, అరెస్ట్ చేశారు. నిందితుడు పేరు రామ్ లఖన్. అతనికి 52 ఏళ్ళు అని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ మొత్తం ఘటన సీసీ టీవీలో రికార్డ్ అయింది.
అక్కడే ఉన్న స్థానికులు ఈ దృశ్యాలు చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. షాక్ నుంచి వెంటనే తేరుకుని.. పోలీసులను ఆసుపత్రికి తరలించారు. 'ఆ కానిస్టేబుల్ ను ఎస్యూవీ ఢీకొట్టింది. మా కళ్ల ముందే ఆయన గాలిలో పైకి ఎగిరి పడ్డారు. కాలికి, తలకి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్లాము.' అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.