Suryapet Crime: సినీ ఫక్కీ తరహాలో రెండు అనుమాన్పద హత్య కేసులను సూర్యాపేట జిల్లా పోలీసులు చేధించారు. అయితే హత్యల వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. భర్తను చంపి.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఓ మహిళ అందరినీ నమ్మించింది. అలాగే అదే మహిళతో వివాహేతర బంధంలో ఉన్న ఓ వ్యక్తి.. తన భార్యను కరెంట్ స్తంభానికి తలను బాది హత్య చేశాడు. రెండు కేసుల్లో పోలీసులు విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం బళ్లుతండాకు చెందిన వెంకన్న..కుటుంబంతో కలిసి సూర్యాపేటలోని భాగ్యనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. మరోవైపు నూతనకల్ మండలం ఎర్రపహాడ్‌కు చెందిన షేక్ రఫీ తన భార్య నస్రీన్‌తో కలిసి శ్రీరాంనగర్‌లో ఉండేవాడు.
Also Read: 18 మందిని చంపిన ఆ హంతకుడు మృతి.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు
ఈ క్రమంలోనే వెంకన్నకు,నస్రీన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ తమ జీవిత భాగస్వాములను అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నారు. పథకం ప్రకారం వెంకన్న ఈ ఏడాది జూన్ 8న రాత్రి భార్య రమాదేవితో కలిసి బళ్లుతండా నుంచి సూర్యాపేటకు బైక్‌పై బయలుదేరాడు. దారి మధ్యలోనే భార్యను కరెంట్ స్తంభానికి కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఈ ఘటనను రోడ్డుప్రమాదంగా చిత్రీకరించాడు. తానూ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు.
ఇదిలా ఉండగా.. మరోవైపు భర్త రఫీని హత్య చేసేందుకు నస్రీన్ సిద్ధమైంది. ప్రియుడు వెంకన్నతో కలిసి స్కెచ్ వేసింది. ఈనెల 9న రాత్రి 10.30 గంటల సమయంలో రఫీ బయటకు వెళ్లాడు. వెంటనే సెల్‌ఫోన్ ద్వారా ఆ విషయాన్ని ప్రియుడికి చేరవేసింది నస్రీన్. వెంటనే వెంకన్న తన మిత్రులు సిరికొండకు చెందిన శ్రీశైలం, నామారానికి చెందిన మధుతో కలిసి రఫీ ఇంటికి వచ్చి అక్కడే దాక్కున్నారు. అరగంట తర్వాత ఇంటికి వచ్చిన రఫీని వారంతా కలిసి హత్య చేశారు. ఆ తర్వాత దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఉరి వేసుకున్నాడని నమ్మించేందుకు రఫీ గొంతకు చీరను బిగించి..సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశారు.
సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు..అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నస్రీన్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో..మృతుడి సోదరుడు సుభాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నస్రీన్ సెల్‌ఫోన్ కాల్‌డేటాను పరిశీలించగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి..రిమాండ్‌కు తరలించారు పోలీసులు. వివాహేతర సంబంధంతో రెండు కుటుంబాలు చిన్నాభిన్నమవ్వడం స్థానికంగా చర్చానీయాంశమవుతోంది. ఈ రెండు హత్యల వల్ల వెంకన్నకి చెందిన ఇద్దరు కుమార్తెలు అలాగే నస్రీన్ కుమారుడు, కుమార్తె అనాథలయ్యారు. అయితే వీళ్లందరూ కూడా ఆరేళ్లలోపు చిన్నారులు కావడం.. అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇక ఈ రెండు కేసులను చేధించిన పోలీసులను ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించారు.