కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న 23 లక్షల తల్లిదండ్రుల, విద్యార్థుల ఆశలపై మోడీ సర్కార్ నీళ్లు చల్లింది. సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజు(జూన్ 4)న విడుదలైన నీట్ రిజల్ట్స్ ఆధారంగా పరీక్ష నిర్వహణ తీరు గమనిస్తే పేపర్ లీక్ అయిందని అర్థంకాక మానదు. దేశంలో అత్యంత కఠినంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్‌లో గతంలో ఎప్పుడూలేని విధంగా 62 మంది విద్యార్థులకు 720/720 మార్కులు వచ్చి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అందులో 8 మంది విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ నుంచి సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయి, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారు. అలాంటిది.. ఒకే సెంటర్‌లో ఇంతమంది విద్యార్థులకు పెద్దమొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రతి మదినీ తొలిచే ప్రశ్న. ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి మరి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటమంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ ) కుట్ర అర్థం అవ్తుంది. దేశ ప్రజల, విద్యార్థుల దృష్టి ఎన్నికల ఫలితాలపై ఉండగా ఎన్టీఏ నీట్ ఫలితాలను విడుదల చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది.
Also Read: ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష
ఫలితాల అవకతవకలపై తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చాలా చిత్రమైన సమాధానాలు ఇచ్చింది. ఈ ఏడాది 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు పేర్కొంది. అసలు నీట్ లాంటి ఎగ్జామ్‌లకు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదు, అయినప్పటికీ ఎందుకిలా చేశారో ఇప్పటికి అర్థంకాని విషయం. 1563 మంది విద్యార్థులకే ఎందుకు గ్రేస్ మార్కులు ఇచ్చారో.. దానికి ఏ ప్రాతిపదికను తీసుకున్నారో స్పష్టం చేయలేదు. +4, -1 విధానం ఉండే ఈ ఎగ్జామ్‌లో సాధ్యం కాని విధంగా కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావటం కూడా మొత్తం గ్రేస్ మార్కుల విధానంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుంది. ఈ మొత్తం అంశం వివాదం కావటంతో ఇప్పుడు ఎన్టీఏ 1563 మందికి విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని వాటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించి మళ్లీ ఎగ్జామ్ రాయిస్తామని లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా ఉన్న ర్యాంకింగ్‌నే జత చేస్తామని పూటకో మాట మాట్లాడుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా నానాతంటాలు పడుతుంది.
ప్రతిసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని.. కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు
వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడకపోవడం విద్యార్థుల పట్ల మోడీ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనం. నీట్ ఎగ్జామ్ మాత్రమే కాక.. దేశంలోని ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్టీఏ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా దానిపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ప్రతిసారీ ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువగా ర్యాంకులు రావడం, దక్షణాది రాష్ట్రాల విద్యార్థులకు తక్కువ ర్యాంకులు రావడంపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు, దక్షణాది రాష్ట్రాల ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
Also Read: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్..
ఈ మొత్తం వ్యవహారంపై మోడీ, తెలంగాణ రాష్ట్ర కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మౌనంవిడి సిట్టింగ్ జడ్జితో, సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థులకు, లక్షలాదిమంది తల్లిదండ్రులకు భరోసానివ్వాలి. తక్షణమే ప్రధాని స్పందించి మొత్తం అవకతవకలకు బాధ్యులెవరన్నది దేశ ప్రజలకు వివరించి , విద్యార్థులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఎన్టీఏ పాత్ర పై అత్యున్నత దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించి పేపర్ లీకేజీలకు పాల్పడిన వారితో పాటు.. అక్రమంగా లబ్ధి పొందిన వారిపై చర్యలు తీసుకోవాలి. నీట్‌లో జరిగిన అక్రమాల కారణంగా కష్టపడి చదివిన మన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి.
గడ్డంశ్యామ్
పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు
9908415381