/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PM-Modi-3-jpg.webp)
మరికొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష నేతలు ఒకరినకొరు విమర్శలు చేసుకోవడం, సభలు, సమావేశాలు, ప్రచారాలతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు హీటెక్కాయి. చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. కాంగ్రెస్, అభివృద్ధి.. ఈ రెండు కూడా ఒకదానితో మరొకటి కలిసి ముందుకు వెళ్లలేవంటూ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో భూపేశ్ బఘేల్ పాలనలో అవినీతి పెరిగిపోయిందన్నారు. రాష్ట్రాన్ని దోచుకునేవారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని.. స్వార్థ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ నాయకులు కష్టపడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఓబీసీ వర్గానికి చెందిన నన్ను 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్లు దూషించినట్లు పేర్కొన్నారు.
కుటుంబ పాలన, బంధుప్రీతి, అవినీతి అనేవి కాంగ్రెస్ విధానాలని.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఛత్తీస్‌గఢ్ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలోని ఐదేళ్ల పాలనలో ఆ పార్టీ నేతల పిల్లలు, బంధువులే ప్రయోజనాన్ని పొందగలిగారని.. పేదలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని విమర్శించారు. దేశాభివృద్ధికి ఛత్తీస్‌గఢ్ వేగంగా అభివృద్ధి చెందడం ఎంతో అవసరమని.. అవినీతిలో కాంగ్రెస్ రికార్డు సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు ప్రధాని. ఇక ఛత్తీస్‌గఢ్‌ను దేశంలో అగ్ర రాష్ట్రాల జాబితాలో చేర్చడమే బీజేపీ లక్ష్యమని.. పేదలు, గిరిజనులు, వెనకబడిన వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తామని అక్కడి ఓటర్లకు హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి విడుతలో 20 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ నిర్వహించనున్నారు. మిగతా 70 స్థానాలకు నవంబర్ 17న రెండో విడుతలో పొలింగ్ జరగనుంది.