Lok Sabha Elections 2024 : లోక్‌సభ (Lok Sabha) ఏడో దశ ఎన్నికల ప్రచారం (Election Campaign) గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. జూన్1న జరగబోయే ఓటింగ్ (Voting) తో లోక్‌సభ ఎన్నికలు పూర్తవుతాయి. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. ఓవైపు మూడోసారి అధికారంలోకి రావాలని ఓవైపు బీజేపీ (BJP).. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఇండియా కూటమి (India Alliance) గట్టి ప్రయత్నాలు చేశాయి. అయితే కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
లోక్‌సభ ఎన్నికల ప్రచారాల్లో అధికార, విపక్ష పార్టీల నేతలు చురుగ్గా పాల్గొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ఎన్నికల కోసం 75 రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రచారాలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 16న కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారం ప్రారభించిన ఆయన.. 75 రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో మొత్తం 200లకు పైగా ప్రచార సభలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే జాతీయ, ప్రాంతీయ మీడియా అనే బేధం లేకుండా ఏకంగా 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇక ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కవగా రోడ్ షోలు నిర్వహించారు.
Also Read: ఎవరెస్ట్ శిఖరం పై ట్రాఫిక్ జామ్..వైరల్ అవుతున్న పోస్ట్!
ప్రస్తుతం 73 ఏళ్లున్న ప్రధాని మోదీ.. ప్రతిరోజూ దాదాపు మూడు నుంచి ఐదు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ సుడిగాలిలా దేశమంతటా చుట్టి వచ్చారు. జూన్ 1న తుది దశ లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం పంజాబ్‌లోని హోషియాపూర్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. లోక్‌సభ ఎన్నికలు ప్రచారం ముగియడంతో.. మే 30 నుంచి జూన్ 1 వరకు ఆయన తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించున్నారు. ఇప్పటికే అక్కడున్న ప్రఖ్యాత వివేకానంద రాక్ మెమోరియల్‌ని సందర్శించారు. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 వరకు.. అప్పట్లో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ధ్యాన్ మండపంలోనే మోదీ ధ్యానం చేయనున్నారు. గత ఎన్నికల్లో కూడా ప్రధాని.. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆధ్యాత్మక పర్యటనలు చేశారు. 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్, 2019లో కేదార్‌నాథ్‌ను సందర్శించారు.
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అనేక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు.. మణిపూర్ నుంచి ముంబయి వరకు భారత్ జోడో యాత్ర పేరుతో పర్యటన చేసిన సంగతి తెలిసిందే. ఈసారి లోక్‌సభ ఎన్నికలు కూడా ఎప్పట్లాగే ఎన్డీయే, ఇండియా కూటమి మధ్యే పోటాపోటీగా జరిగాయి. జూన్1న సార్వత్రిక ఎన్నికలు ముగుస్తుండటంతో ఆరోజు రాబోయే ఎగ్జిట్ ఫలితాల కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇక కేంద్రంలో ఈసారి అధికార పగ్గాలు చేపట్టేది ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read: అప్పుడు మీ అందరి కళ్లు ఎక్కడ ఉన్నాయి…ఆల్ ఐస్ ఆన్ రఫా పై ఇజ్రాయిల్ సీరియస్!