తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయిన సమయంలో.. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటికీ ఏపీలో రాజధాని రాలేదు. మరోవైపు పదేళ్ల పాటు ఇచ్చిన గడువు కూడా మరికొన్ని రోజుల్లో ముగియనుంది. దీంతో హైదరాబాద్‌ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ చట్టం తీసుకొచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ.. ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ విభజన చట్టం ప్రకారం.. తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న అప్పులు, ఆస్తులు, తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న పలు కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదని.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రజాసంక్షేమ సేవాసంఘం కార్యదర్శి పొదిలి అనిల్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
Also Read: డ్రైవర్ క్రికెట్ చూస్తూ రైలు నడపడంతోనే ప్రమాదం: అశ్వినీ వైష్ణవ్
కేంద్ర ప్రభుత్వం విఫలమైంది
మరో పదేళ్ల పాటు అంటే.. 2034 వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ చర్యలు తీసుకునేలా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని ఆదేశించాలని పిల్‌లో పేర్కొన్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఉన్న రూల్స్‌ను అమలు చేయకపోవడాన్ని.. రాజ్యాంగ, చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. కేంద్రం సరైన విధానాలు పాటించకపోవడం వల్లే ఏపీకి ఇంతవరకు రాజధాని లేకుండా పోయిందని తెలిపారు. పరస్పర సహకారాలు, ఒప్పందాలు లేకపోవడం.. అలాగే చట్టబద్ధమైన విధులు నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ఇందువల్లే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనలకు సంబంధించి వివాదాలకు దారి తీసినట్లు చెప్పారు.
వివాదాలు పరిష్కరించాలి
అయితే ఈ సమస్యలు పరిష్కరించేదుకు కేంద్రానికి అధికారం ఉన్నప్పటికి తన బాధ్యతను నెరవేర్చలేకపోయిందని అన్నారు. విభజన చట్టం అమలులో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో.. వివాదాలు కోర్టులుకు వెళ్తున్నాయన్నారు. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉన్నప్పుడే.. అప్పులు, ఆస్తుల విభజనకు సంబంధించిన వివాదాలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇది జరగకపోతే ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. 2014 విభజన చట్ట నిబంధనలు అమలు కాకపోవడంతో.. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని అడిగే హక్కు ఏపీకి ఉంటుందని చెప్పారు.
Also read: నీళ్లు అడిగితే చంపేస్తారా?.. జగన్ సర్కార్‌పై లోకేష్ ఫైర్