Pawan Kalyan To Attend Yuvagalam Padayatra: టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ చేపట్టిన యువగళం ముగింపు కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఈనెల 20న పాదయాత్ర విజయోత్సవం సభకోసం టీడీపీ (TDP) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజున వేరే ఇతర కార్యక్రమాలు ఉన్నాయని..తాను హాజరు కానని తొలుత పవన్ టీడీపీ నేతలకు సమాచారం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం రాత్రి పవన్ కల్యాణ్ తో చంద్రబాబు (Chandrababu) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం మేరకు తాను సభకు హాజరువుతానని పవన్ (Pawan Kalyan) చెప్పారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యువగళం సభకు (Yuvagalam) హాజరవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
కాగా ఎల్లుండి యువగళం విజయోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి..
దేశ విదేశాల నుంచి జనాలు ఈ సభకు వస్తున్నారని ఆయన తెలిపారు. విశాఖ ఏయూ మైదానంలో ఈ సభ నిర్వహించాలని అనుమతి కోరినట్లు వెల్లడించారు. రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చామన్న అచ్చెన్నాయుడు..ప్రభుత్వం VC పై ఒత్తిడి తెచ్చి అనుమతి ఇవ్వకుండా చేసిందని ఆరోపించారు. ఆర్టీసీ ఎవ్వరికి అయినా బస్సులు అద్దెకు ఇవ్వచ్చన్నారు. దానికి చార్జీలు కూడా తీసుకుంటారని తెలిపారు. వీటికి స్వయంగా నేనే అభ్యర్థించ్చానన్న అచ్చెన్నాయుడు..ప్రైవేట్ కాలేజీల వాహనాలు ఇస్తామన్నారని తెలిపారు. వారందరినీ ప్రభుత్వం బెదిరిస్తుందని...
జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా..సభ నిర్వహించి తీరుతామన్నారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా పెద్ద ఎత్తున 5 లక్షల మంది ప్రజలు సభకు రాబోతున్నట్లు తెలిపారు.కార్యకర్తలు స్వచ్చందంగా రైళ్లు పెట్టుకొని రాయలసీమ నుంచి కూడా వస్తున్నారని...ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
కాగా చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు 11 నెలల పాటు సాగిన ఈ యాత్ర సోమవారం విశాఖ జిల్లా ఆగనంపూడి దగ్గర ముగియనుంది. పాదయాత్ర ముగిసే సమయానికి లోకేశ్ మొత్తం 3,132 కి.మీ పూర్తి చేయనున్నారు. ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నామీకోసం పాదయాత్రను కూడా అగనంపూడి వద్దే ముగించారు. ఆ సెంటిమెంటుతోనే ఇప్పుడు లోకేశ్ కూడా తన పాదయాత్రను అక్కడే ముగిస్తున్నారు. ఈ క్రమంలో 20న నిర్వహించనున్న విజయోత్సవ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బాలక్రుష్ణ,టీడీపీ ఇతర ముఖ్యనేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొంటారని సమాచారం.