ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న దాడులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. దాదపు మూడున్నర నెలలుగా ఈ యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ దాడుల్లో ఇప్పటివరకు 25 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 178 మంది మరణించగా.. 300 మంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది. మరోవైపు ఈ దాడుల్లో మృతి చెందినవారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.
Also Read: మోదీ నాయకత్వం వల్లే రామమందిరం నిర్మించగలిగాం: న్యూజిలాండ్
అయితే అక్టోబర్ 7 నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా మొత్తం 25,105 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అలాగే మరో 62,681 మంది క్షతగాత్రులయ్యారు. చాలా ప్రాంతాల్లో కూడా శిథిలమైన భవనాల కింద పడిపోయి చిక్కుకున్నారు. ప్రస్తతం వారు అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటూ గాజా ఆరోగ్య విభాగం అధికార ప్రతినిధి అష్రాఫ్ అల్-కిద్రా తెలిపారు. మరణించినవారిలో సాధారణ పౌరులు ఎంతమంది ఉన్నారు, అలాగే హమాస్ మిలిటెంట్లు ఎంతమంది ఉన్నారనే వివరాలు తెలియజేయలేదు.
అయితే దాదాపు 9వేల మంది హమాస్ మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ సైన్యం అంచనా వేస్తోంది. ఇదిలాఉండగా.. అక్టోబర్ 7న హమాస్ తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 1200 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ప్రతిదాడులు ప్రారంభించింది. ఇప్పటికే 85 శాతం మంది గాజా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్షల మంది తలదాచుకుంటున్నారు.
Also Read: వైఎస్‌ఆర్ వాచ్ షర్మిల చేతికి .. కారణం ఇదేనా?