Kolkata Doctor Case: ఒక్కరు కాదు చాలామంది ఉన్నారు.. అభయ తల్లిదండ్రుల సంచలన ఇంటర్వ్యూ

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అభయ తల్లిదండ్రులు తమ కూతురుకి జరిగిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో చాలామందికి సంబంధం ఉందని ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Kolkata Doctor Case: ఒక్కరు కాదు చాలామంది ఉన్నారు.. అభయ తల్లిదండ్రుల సంచలన ఇంటర్వ్యూ
New Update

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ అభయ హత్యాచార ఘటనలో రోజురోజుకు విస్తుపోయే విషయాలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్‌ రాయ్‌కు కూడా శుక్రవారం కోల్‌కతా ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు ఆర్జీకార్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, మరో నలుగురు డాక్టర్లు, అలాగే సంజయ్‌ రాయ్‌కు పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) టెస్టు చేసేందుకు కూడా కోర్టు అనుమతిచ్చింది. అయితే ట్రైనీ డాక్టర్‌ తల్లిదండ్రులు తమ హత్యాచార ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదో కుట్ర జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు తాజాగా ఓ జాతీయా మీడియాతో మాట్లాడారు.

తమ కూతురికి డైరీ రాయడం అంటే ఇష్టమని.. ప్రతిరోజూ డైరీ రాసేదని చెప్పారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఆ డైరీలో కొన్ని పేజీలు కనపడకుండా పోయాయని.. కనీసం మూడు పేజీల వరకు డైరీలోని పేజీలు చింపేసినట్లు పేర్కొన్నారు. తమ కూతురు డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (MD)లో గోల్డ్‌ మెడల్ సాధించాలని లక్ష్యం పెట్టుకుందని.. ఈ విషయాన్ని తను డైరీలో కూడా రాసినట్లు వివరించారు. ఈ కేసులో సీబీఐ తన విధులను సక్రమంగా నిర్వహిస్తేనే మాకు న్యాయం జరుగుతుందని తెలిపారు.

Also Read: పాలిగ్రాఫ్‌ టెస్టు అంటే ఏంటీ.. ఎలా చేస్తారు ?

అభయ తల్లిదండ్రులు చెప్పిన కీలక విషయాలు

''ఆగస్టు 8న గురువారం.. రాత్రి 8.30 PM గంటలకు, అలాగే రాత్రి 11.15 PM గంటలకు మా కూతురితో ఫోన్‌లో మాట్లాడాం. అప్పుడు ఆమె తన జూనియర్‌కు ఆహారం ఇస్తున్నట్లు చెప్పింది. సాధారంగా సీనియర్లు తమ జూనియర్లకు ఆహారం ఇస్తుంటారు. మా కూతురు పనిచేస్తున్న డిపార్ట్‌మెంట్‌లో 70 మంది రోగులు ఉన్నారు. ఆ రాత్రి పూట డాక్టర్ ఎక్కడికి వెళ్లిందో అని ఎవరూ ఆలోచించలేదు. డాక్టర్ ఎక్కడుందో అని ఎవరూ కూడా ఆ రాత్రి వెతకలేదు. దీన్నిబట్టి చూస్తే.. మా కూతురు పనిచేస్తున్న డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఎవరో ఒకరికి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. ఆ మరుసటి రోజు ఉదయం 10.53 AM గంటలకు మాకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. అందులో ఒక అమ్మాయి మాతో మొరటుగా మాట్లాడింది. తమ కూతురుకు ఆరోగ్యం బాలేదని.. ఆస్పత్రికి రావాలని చెప్పింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆ తర్వాత ఆ అమ్మాయికే మేము ఫోన్‌ చేశాం. ఆమె ఆస్పత్రికి తొందరగా రావాలని చెప్పింది.

మేము కారులో ఉన్నప్పుడు.. అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌ కాల్ చేశాడు. మా కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పాడు. తొందరగా ఆస్పత్రికి రమ్మన్నాడు. మేము మధ్యాహ్నం 12.00 PM గంటలకు అక్కడికి చేరుకున్నాం. నన్ను ఒకరు పక్కకి తీసుకెళ్లారు. నా భార్యను మరొకరు పక్కకి తీసుకెళ్లారు. కానీ మూడు గంటల వరకు ఎవరూ కూడా మమ్మల్ని సెమినర్‌ హాల్ వద్దకు తీసుకెళ్లలేదు. పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. మా కూతురు పనిచేసే డిపార్ట్‌మెంట్‌ వాళ్లు ఎవరూ కూడా అక్కడ లేదు. కేవలం పోలీసులు మాత్రమే ఉన్నారు. ప్రిన్సిపల్‌ మమ్మల్ని ఆఫీసుకు రావాలని పిలిస్తునన్నాడు. మేము గట్టిగా అరిచిన తర్వాత చివరికి ప్రిన్సిపల్ మా దగ్గరికి వచ్చాడు. కానీ మాతో ఏమీ మాట్లాడలేదు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కమిషనర్‌ ఫోన్‌కు కాల్ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. మా కూతురి పోస్టుమార్టం సాయంత్రం 6.10 PM గంటలకు ముగిసింది. మా కూతురు తన స్నేహితుల గురించి ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆమెతో పాటు డ్యూటీలో మరో నలుగురు ఉన్నారు. మా కూతురి అంత్యక్రియలు వేగంగా జరిగిపోయాయి. ఈ కార్యక్రమానికి ఎవరు డబ్బులు పెట్టారో కూడా తెలియదు. ఈ కేసులో మొదటినుంచే పోలీసుల విచారణ తప్పుదారి పడుతోంది. ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయొద్దని మేము ఎవరికీ చెప్పలేదు. సాయంత్రం 6.00PM గంటలకు ఫిర్యాదు చేశాం. కానీ రాత్రి 11.45PM గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సంజయ్ రాయ్‌ గురించి అసలు మేము ఏమి వినలేదు. చాలామందికి ఈ ఘటనతో సంబంధం ఉంది. సీఎం మమతా బెనర్జీ మాకు రూ.10 లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు. కానీ మాకు డబ్బులు వద్దు. కేవలం న్యాయం మాత్రమే కావాలని'' అభయ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

#telugu-news #national-news #kolkata-doctor-case #kolkata-doctor-murder
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe