Ambedkar Jayanti: పీడిత వర్గాల విముక్తిదాత.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నేడు

డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహా నేత. ఆయన జీవితం బడుగు, బలహీన, పేద వర్గాల హక్కుల కోసం సాగిన ఒక నిరంతర పోరాటగాథ. అణగారిన వర్గాలకు స్వాభిమానం కలిగించిన ఈ మహాపురుషుడి జయంతి నేడు

author-image
By Madhukar Vydhyula
New Update
Ambedkar Jayanti

Ambedkar Jayanti

Ambedkar Jayanti: డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహా నేత. ఆయన జీవితం బడుగు, బలహీన, పేద వర్గాల హక్కుల కోసం సాగిన ఒక నిరంతర పోరాటగాథ. అణగారిన వర్గాలకు స్వాభిమానం కలిగించిన ఈ మహాపురుషుడు భారత రాజ్యాంగ నిర్మాతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఇక కులాల పునాదులను తుదకంటా కదల్చాలని ఒక మహనీయుడు  చెప్పిన నేలపై అవే కులాలు వెయ్యి అడుగుల లోతు పునాదిపై దృఢంగా పాతుకునిపోతున్నాయి. సమానత్వాన్ని జాతి జనులు పాడుకునే గీతంగా పరిమళింపజేసే రాజ్య వ్యవస్థను ఆయన కోరుకుంటే, అసమానతలకు ఆజ్యం పోసి నరనరానా కుల స్వభావాన్ని, కులాహంకారాన్ని, కులపీడనను జాతి గుండెల్లో ప్రతిష్టింపజేసే పనిలో పాలకులు మునిగి పోతున్నారు. పౌరుల గౌరవాన్ని పెంచే పాలనను ఆయన కలగంటే పౌరుల సమస్త హక్కులనూ రకరకాల ముసుగులతో తొక్కివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సకల జీవన రంగాల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని ఆయన ఆశిస్తే, ఆ భావననే రాజ్యాంగంలోంచి తొలగించేసాహసానికి నేటి పాలకులు పూనుకుంటున్నారు. 

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..


ఎవరైనా దళితులుగాపుట్టాలని కోరుకుంటారా అనే అప భ్రంశపు వ్యాఖ్యలు చేసే ముఖ్యమంత్రులను. పార్టీ పెద్ద పెద్ద నాయకులను మనం చూస్తున్నాం. అంబేద్కర్ అంటే ఆయన దేవుడా అన్న వాళ్లను కూడా చూస్తున్నాము. కొంతమంది ఎకసెక్కాలు చేసే కేంద్ర మంత్రులను చూస్తున్నాం. ఇలా ఒకటేమిటి? అంబేదద్కర్ ఆశయాలను భూస్థాపితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని చేస్తూ కూడా అంబేదద్కర్ మావాడంటేమావాడంటూ పాలకులు ఆయన విగ్రహాలను కౌగిలించుకుంటూ, పంచుకుంటూ బతికేస్తున్న కాలాన్ని మనం చూస్తున్నాం. మనువాద పార్టీల నుంచి పెట్టుబడి పార్టీల  దాకా డాక్టర్ బి.ఆర్. అంబేద్కరును తమవాడిగా నిలబె డుతూ ఆయన అసలు అభిమతానికి తూట్లుపొడుస్తూ అంబేదద్కర్ భజనచేయడంలో పోటీ పడుతున్నారా అనిపిస్తోంది.

Also Read: Musk-Trump: ట్రంప్ మీటింగ్‌లో మస్క్ "టాప్ సీక్రెట్" నోట్..అసలు అందులో ఏముంది!

బాల్యం నుండి విద్యార్ధి దశ


అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని మౌ నాఘ్ జిల్లాలో అంబావాడ గ్రామంలో జన్మించారు. ఆయన సామాజికంగా అణగారిన మహార్ కులానికి చెందినవారు. చిన్ననాటి నుండే అంబేద్కర్ కుల వివక్షను ఎదుర్కొన్నారు. పాఠశాలలో ఇతర బాలలతో కూర్చోవడానికీ, నీరు తాగడానికీ ఆయనకు అనుమతి ఉండేది కాదు. అయినప్పటికీ ఆయన చదువుపై ఉన్న మక్కువ, మేధస్సు, పట్టుదల వల్ల ఎంతో ముందుకు వెళ్లగలిగారు.
అంబేద్కర్ ముంబయిలో బ్యారిస్టర్ చదివారు. తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. భారతదేశ చరిత్రలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్ పొందిన తొలి దలిత్ విద్యార్ధిగా నిలిచారు. అంబేద్కర్ బహుళ సామాజిక ఉద్యమాలను చేపట్టారు. 1927లో మహారాష్ట్రలోని మహద్ పట్టణంలో “చవ్దార్ తాలాబ్” ఉద్యమం ద్వారా దళితులు పబ్లిక్ వాటర్ ట్యాంక్‌లో నీరు తాగే హక్కును సాధించారు. 1930లో కలారం ఆలయంలో ప్రవేశించేందుకు నిర్వహించిన “కలారం టెంపుల్ ఎంట్రీ” ఉద్యమం సుదీర్ఘ సామాజిక పోరాటానికి నాంది పలికింది.అంబేద్కర్ జాతి విధ్వేషాన్ని ఖండిస్తూ దళితులకు ప్రత్యేక రాజకీయ ప్రతినిథ్యం అవసరమని గట్టి విశ్వాసం కలిగి ఉండేవారు. ఆయన 1932లో బ్రిటిష్ ప్రభుత్వంతో పూనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం వల్ల దళితులకు రిజర్వేషన్లు లభించాయి.

Also Read: Holiday: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఈ వారంలోనే రెండు సెలవులు!

రాజ్యాంగ రచయితగా పాత్ర


స్వాతంత్ర్యం అనంతరం 1947లో భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ అంబేద్కర్‌ను భారత రాజ్యాంగ సిద్ధాంత సమితి చైర్మన్‌గా నియమించారు. ఆయన నాయకత్వంలో 1949లో భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగాలలో ఒకటిగా పేరుపొందింది. అందులో అన్ని వర్గాల హక్కులను పరిరక్షించే విధంగా నిబంధనలు చేర్చారు. అంబేద్కర్ రాజ్యాంగంలో సమానత్వం, స్వేచ్ఛ, భద్రత, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతిష్టించారు. పేదలకు, మహిళలకు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాల కల్పన కోసం కృషి చేశారు. అంబేద్కర్ మహిళల హక్కుల కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. ఆయన మహిళలకు సమాన వారసత్వ హక్కులు, విడాకులు, ఆస్తిపరమైన హక్కులు కల్పించాలన్న దృష్టితో హిందూ కోడ్ బిల్ రూపొందించారు. అయితే అప్పట్లో అది తీవ్ర ప్రతిఘటనకు గురైంది. ఆఖరి దశలో అంబేద్కర్ హిందూ మతంలో ఉన్న కులవ్యవస్థను వ్యతిరేకిస్తూ బౌద్ధమతాన్ని స్వీకరించారు. 1956లో లక్షల మంది అనుచరులతో కలిసి నాగ్‌పూర్‌లో బౌద్ధమతంలో ప్రవేశించారు. “నా జన్మ హిందువుగా జరిగిందొక తప్పు, కానీ నేను హిందువుగా మరణించను” అన్న ఆయన ప్రసిద్ధ ప్రకటన ఆయన స్థిరమైన ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది.

Also Read: Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!

డాక్టర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మరణించారు. అయితే ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు, ఉద్యమాలు ఇంకా నేటికీ భారత సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆయన రచనలలో “అన్హైండూ కాస్ట్స్”, “ది బుద్ధా అండ్ హిస్ ధమ్మా”, “వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ది అణ్ టచ్‌బుల్స్?” వంటి గ్రంథాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితం భారతదేశపు సామాజిక న్యాయం కోసం సాగిన యాత్ర. ఆయన బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసమే కాదు, సమాజమంతటికీ గౌరవవంతమైన జీవితం సాధించేందుకు మార్గదర్శకుడయ్యారు. బాబా సాహెబ్ జయంతులూ, వర్ధంతులప్పుడూ ఆయనను గౌరవిస్తున్నాం అంటూ తల నుండి కాళ్లదాకా కనిపించకుండా పూల దండలతో కప్పేయడమేనా మనం  చేస్తున్నది. ఆయన విభేదించిన అంశాలను మన కుటుంబ సామాజిక జీవితాల నుండి తొలగించుకుంటూ రాజ్యాధికార సాధన, మానవ హక్కుల సాధనపై సైద్ధాంతిక పోరాటాలు చేయాల్సి ఉన్న విషయం మాటేమిటి? అరకొర ఆవేశాలూ ఆర్భాటాలతో ఏమీ జరగదని ఆయన అనంతరం 70 ఏళ్ల కాలం చెంప దెబ్బలు కొడ్తూనే ఉన్నారు. కుల వ్యవస్థను తీవ్రంగా నిరసిస్తూ ఆ సుడి గుండం నుండి బయటపడి తన  మతం మార్చుకుని మరీ చూపించాడు అంబేద్కర్. తన జీవన పర్యంతం దళితుల కోసం పోరాడినట్లు అనిపించినా ఆయనది పీడితుల విముక్తి దృక్పథం. ఆయన బడుగుల ప్రతినిధి. సామాజిక, సాంస్కృతిక, జాతుల దార్శనికుడు. ఉపేక్షలూ, వక్రీకరణలకు చిక్కుబడని పవిత్రాత్ముడు. అధ్యయనం, పోరాటం గా యుద్ధం చేసిన సృజన యోధుడు.

ప్రజాస్వామికత, జాతీయత, సందేశాత్మకత, ఆచరణాత్మకత కలబోసిన స్వభావంతో రాజీలేని పోరాటం చేసిన పేదల పెన్నిధి. దగాపడ్డ దీనుల రక్షకుడు, మానవ హక్కుల మహోన్నతమైన నాయకుడు. అందరివాడు అంబేద్కరుడు నాడు హిందూ జాతీయ వాదం నేడు హిందూ సామ్రాజ్యవాదం సమాజాన్ని చిన్నాభిన్నం చేసి సమగ్రత లేకుండా కొల్లగొడుతున్న సందర్భం. ఈ విధ్వం సాన్ని ఎదుర్కొనే ఆయుధాలు ఫూలే, అంబేద్కరిజాలు. అధ్య యనం, ఆచరణ, రాజీలేని ఉద్యమాలు ఇవీ ఫూలే - అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే మార్గాలు. వారికి జోహార్లు అర్పించడ మంటే వారి మార్గాన్ని అనుసరించడమే. ఆయనను నిజంగా గుర్తించాలంటే, మనం అనుసరించాల్సిందేమిటంటే...తత్వవేత్త, ఉద్యమ నేత, రాజ్యాంగ నిర్మాత, ప్రజా హక్కుల పరిరక్షకుడిగా ఆయన జీవనదృష్టిని అనుసరించడమే.

(నేడు బీఆర్ అంబేద్కర్ జయంతి)

మన్నారం నాగరాజు
తెలంగాణ లోక్ సత్తా పార్టీ 
రాష్ట్ర అధ్యక్షుడు
95508 4443

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు