Bangladesh: బంగ్లాదేశ్ లో మరోసారి రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. తాజా హింసలో 93 మంది పౌరులు మృతి చెందారు. అధికార పార్టీ మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగడంతో ఈ హింస మొదలైంది. మరణించినవారిలో 14 మంది పోలీసులు కూడా ఉన్నారు. వీరిలో 13 మంది పోలీసులు సిరాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడిలో మృతి చెందారు.
1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటం జరగ్గా... ఆ ఘర్షణలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు 30 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. అయితే, ఈ రిజర్వేషన్లు ఎత్తివేసి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని బంగ్లాదేశ్ లోని ప్రధాన నగరాల్లో నిరసనకారులు రెండు రోజులుగా రోడ్లెక్కారు.
ఢాకా యూనివర్సిటీ విద్యార్థుల నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. గతకొంతకాలంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 100 మంది వరకు మృతి చెందారు. తాజాగా, మరోసారి ఘర్షణలు చెలరేగడంతో బంగ్లాదేశ్ లో అధికారులు నిరవధిక కర్ఫ్యూ విధించారు.