ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు తాను జైలులో ఉంటానో..? బయట ఉంటానో..? తెలియదన్నారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని సింగౌలీలోని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. వాస్తవానికి ఆయన గురువారమే మద్యం కుంభకోణం కేసులో ఈడీ ముందు హాజరుకావాల్సి ఉంది. కానీ దానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్న కేజ్రీవాల్.. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
'అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే సమయానికి నేను జైలులో ఉంటానో..? బయట ఉంటానో..? తెలీయదు. నాకు జైలు జీవితం గురించి ఏ మాత్రం భయం లేదని.. ఢిల్లీ, పంజాబ్ ప్రజల లాగే మీరు కూడా ఆప్‌కు విజయం అందించాలని' కోరారు. మరోవైపు బీజేపీపై విమర్శలు గుప్పించారు. నన్ను అరెస్టు చేస్తామని వాళ్లు ప్రతిరోజూ బెదిరిస్తున్నారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినా ఆయన ఆలోచనలను ఎలా ఆపగలరంటూ ధ్వజమెత్తారు. ఈ కోట్లాది కేజ్రీవాళ్లను ఎలా అరెస్టు చేయగలరంటూ ప్రశ్నించారు. మీరు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు.. కానీ ఎన్ని పాఠశాలలు నిర్మించారని దేశ చిన్నారులు అడుగుతున్నారని ఉద్ఘాటించారు.
నేను, సత్యేందర్ జైన్, మనీశ్ సిసోదియా రామ్‌లీలా మైదానం వేదికపై కూర్చునే వాళ్లమని.. మీరు మమ్మల్ని అరెస్టు చేసినా.. మైదానానికి వచ్చే ప్రజలందర్నీ అరెస్టు చేయగలరా అంటూ ప్రశ్నించారు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఈడీ విచారణకు వస్తే ఆయన్ని అరెస్టు చేస్తారని ఆప్ నేతలు చెబుతున్నారు. ఒకవేళ కేజ్రీవాల్ గనక అరెస్ట్ అయితే.. పార్టీ, ప్రభుత్వం జైలు నుంచే నడుస్తాయని చెప్పడం చర్చనీయాంశమవుతోంది.