వడగళ్ల వర్షంతో విమానం ముందు భాగానికి రంధ్రం ఏర్పడింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు అధికారులు. ఈ ఘటన ఇటలీలోని మిలాన్ ఎయిర్ పోర్టులో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఇటలీలోని మిలాన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ జేఎఫ్ కే ఎయిర్ పోర్టుకు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రోమ్ లో అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన 158 నెంబర్ విమానం 215 మంది ప్రయాణికులతో మిలాన్ నుంచి బయల్దేరింది.
విమానం గాల్లోకి ఎగిరిన సమయంలో అనుకూలంగా ఉన్న వాతావరణం.. ఆ తర్వాత ఒక్కసారిగా ప్రతికూలంగా మారింది. వడగళ్లు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఆ వడగళ్లు విమానం ముందు భాగం, రెక్కలపై పడ్డాయి.
అవి కాస్తా పూర్తిగా ధ్వంసమవ్వగా.. విమానం ముందు భాగానికి ఏకంగా పెద్దపాటి రంధ్రం పడింది. ఈ క్రమంలో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని రోమ్ కు మల్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.