/rtv/media/media_files/2025/12/23/vijay-mallya-and-lalit-modi-2025-12-23-16-49-28.jpg)
Why India Struggles to Extradite Vijay Mallya and Lalit Modi, know details
బ్యాంకుల నుంచి వేల కోట్లు దోచుకొని పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, లలిత్ మోదీలను భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అవి ఫలించడం లేదు. ప్రస్తుతం వాళ్లు బ్రిటన్‌లో లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల విజయ్ మాల్యా 70వ పుట్టిన రోజు సందర్భంగా లలిత్ మోదీ గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. బెల్‌గ్రేవ్ స్క్వేర్‌లోని లలిత్ మోదీ ఇంట్లో ఈ బర్త్‌డే వేడుకలు జరిగాయి. వివిధ ప్రముఖులు కూడా ఈ పార్టీలో పాల్గొని ఎంజాయ్ చేశారు. కొన్నేళ్ల క్రితం దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యాను, లలిత్ మోదీని భారత్‌కు రప్పించడం కష్టంగా మారిపోయింది. ఇంతకీ వాళ్లు ఏం చేశారు. ఎందుకు ప్రభుత్వం వాళ్లని భారత్‌కు రప్పించలేకపోతోంది అనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
విజయ్ మాల్యా ఎవరు ?
ప్రముఖ వ్యాపారవేత్త విట్టల్ మాల్యా కొడుకే విజయ్ మాల్యా. తండ్రి మరణంతో 28 ఏళ్ల వయసులోనే యూనైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ బాధ్యతలు విజయ్ మాల్యా చేపట్టారు. ఆ తర్వాత కింగ్‌ఫిషర్ బీర్ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. 2005లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సైతం ప్రారంభించి విమానయాన రంగంలో అడుగుపెట్టారు. అలాగే రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ (RCB ఐపీఎల్ జట్టు, ఫార్ములా వన్ రేసింగ్), ఫార్మాస్యూటికల్ రంగాల్లో సైతం తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయారు.
2008లో కింగ్‌ఫిషర్ నష్టాల్లో ఉన్నప్పటికీ విజయ్ మాల్యా ఎయిర్ డెక్కన్‌ను కొనుగోలు చేశారు. అలాగే ఆ ఏడాదిలో ఆర్థిక మాంద్యం వచ్చింది. దీంతో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం మొదలైంది. 2011 నాటికి ఆ సంస్థకు అప్పులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగుల సమ్మే వల్ల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లైసెన్స్‌ను రద్దు చేసింది. 2012 అక్టోబర్‌లో కింగ్‌ఫిషర్ తన చివరి విమానాన్ని నడిపి కార్యకలాపాలను పూర్తిగా నిలిపేసింది.
విజయ్ మాల్యాపై ఆరోపణలు ?
కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంక్షోభం తర్వాత విజయ్ మాల్యాపై అనేక ఆరోపణలు వచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేతృత్వంలోని 17 బ్యాంకుల నుంచి తీసుకున్న దాదాపు రూ.9 వేల కోట్లకు పైగా (వడ్డీతో సహా) రుణాలు చెల్లించలేదనే ప్రధాన ఆరోపణ వచ్చింది. విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా తప్పుడు ఆర్థిక నివేదికలు చూపించి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. అంతేకాదు బ్యాంకుల నుంచి పొందిన రుణాలను ఎయిర్‌లైన్స్ అవసరాల కోసం కాకుండా విదేశాల్లో ఆస్తులు కొనేందుకు, షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరోపిస్తోంది. ఏకంగా రూ.4 వేల కోట్లను ట్యాక్స్ హెవెన్స్‌గా పిలిచే బెర్ముడా, స్విట్జర్లాండ్, సింగపూర్ లాంటి దేశాలకు మళ్లించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అంతేకాదు విజయ్ మాల్యా 2017లోనే కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు భారత సుప్రీంకోర్టు నిర్ధారించింది. తన ఆస్తి వివరాలు వెల్లడించకుండా కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ ఆయన పిల్లలకు సుమారు రూ.317 కోట్లు బదిలీ చేశారనే ఆరోపణలతో ఆయనకు 4 నెలల జైలు శిక్ష విధించింది.
తనపై ఆర్థిక నేరాల ఆరోపణలు రావడంతో 2016లో విజయ్ మాల్యా భారత అధికారులకు దొరక్కుండా లండన్‌కు పారిపోయారు. ఆ తర్వాత విచారణకు రావాలని కోర్టులు అనేకసార్లు సమన్లు జారీ చేసినా ఆయన రాలేదు. దీంతో 2019లో విజయ్ మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించారు. బ్రిటన్‌లో ఉన్న కోర్టులు 2018లోనే విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలని తీర్పు ఇచ్చాయి. ఆయన చేసిన అప్పీళ్లను కూడా బ్రిటన్ హైకోర్టు 2020లో తిరస్కరించింది.
భారత్‌కు తీసుకురావడం సాధ్యం కాదా ?
అయితే విజయ్ మాల్యాను అప్పగించేందుకు అంతా రెడీ అయినప్పటికీ బ్రిటన్‌లో ఓ గోప్యమైన న్యాయపరమైన సమస్య ఉందని నిపుణులు చెబుతున్నారు. మాల్యా అక్కడ రాజకీయ ఆశ్రయం కోసం కోరి ఉండొంచ్చని అది తేలేవరకు ఆయన్ని అప్పగించడం సాధ్యం కాదని తెలుస్తోంది. బ్రిటన్ చట్టాల ప్రకారం ఒక వ్యక్తి తన ప్రాణాలకు లేదా మానవ హక్కులకు భంగం కలుగుతుందని అక్కడ ఆశ్రయం కొరితే ఆ ప్రక్రియ ముగిసిపోయే వరకు బ్రిటన్ నుంచి పంపడం కుదరదు.
విజయ్ మాల్యా వాదన ఏంటి ?
విజయ్ మాల్యా తాను దొంగను కాదని కేవలం వ్యాపారంలో మాత్రమే నష్టపోయానని చెబుతున్నారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిని కాదని వాదిస్తున్నారు. బ్యాంకుల అసలు మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని.. కానీ ప్రభుత్వం మాత్రం రాజకీయ కారణాలతో తనను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు.
లలిత్ మోదీ ఎవరు ?
లలిత్ మోదీ ప్రముఖ వ్యాపారవేత్త. ఈయన 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ను ప్రారంభించారు. ఐపీఎల్ మొదటి ఛైర్మన్‌గా, బీసీసీఐ ఉపాధ్యక్షిడిగా పనిచేశారు. క్రికెట్‌ను కేవలం క్రీడగా కాకుండా భారీ వ్యాపార వనరుగా మార్చి దాని రూపురేఖలే మార్చేసిన ఘనత ఈయనకే దక్కుతుంది.
ఆరోపణలు ఏంటి
IPL నిర్వహణలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని లలిత్ మోదీపై ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎల్ మీడియా హక్కుల కేటాయింపులో రూ.125 కోట్లు (వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ ద్వారా) అక్రమంగా మళ్లించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదు చేసింది. నమోదయ్యాయి. అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలంలో లలిత్ మోదీ అవకతవకలకు పాల్పడినట్లు బీసీసీఐ ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. ఎలాంటి పర్మిషన్లు లేకుండా విదేశాలకు నిధులు తరలించడం, విదేశీ మార్పిడి రూల్స్‌ను ఉల్లంఘించడంపై ఆయనకు 15కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఐపీఎల్ మూడో సీజన్ ముగిశాక 2010లో లలిత్ మోదీ లండన్‌కు పారిపోయారు.
విజయ్ మాల్యా లాగే లలిత్ మోదీని కూడా భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా అది సాధ్యం కావడం లేదు. లలిత్ మోదీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని భారత్ విజ్ఞప్తి చేసింది. కానీ దీన్ని ఇంటర్‌పోల్ పలుమార్లు తిరస్కరించింది. తగినన్ని ఆధారాలు లేవని, ఇది రాజకీయ ప్రేరేపితమని ఆయన వాదించడంతో ఇంటర్‌పోల్ భారత విజ్ఞప్తిని తిరస్కరించింది. అంతేకాదు ఈ ఏడాది మార్చిలో లలిత్ మోదీ తన భారత పాస్‌పోర్ట్‌ను అప్పగించి.. పసిఫిక్ దేశమైన 'వనాటు' పౌరసత్వం తీసుకొనేందుకు యత్నించారు. కానీ ఇందులో భారత్ జోక్యం చేసుకోవడంతో వనాటు ప్రధాని ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆదేశించారు.
లలిత్ మోదీ వాదన
లలిత్ మోదీ కూడా బ్రిటన్ చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకుంటున్నారు. తానూ ఎలాంటి తప్పు చేయలేదని, ఇందుకు ఆధారాలు లేవని, కేవలం రాజకీయ శత్రుత్వం వల్లే తనను టార్గెట్ చేస్తున్నారని ఆయన లండన్ కోర్టుల్లో వాదిస్తున్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, 15 ఏళ్లుగా ప్రపంచమంతా తిరుగుతున్నానని నాపై ఒక్కకేసు కూడా నిరూపణ కాలేదని అంటున్నారు. తాను బీసీసీఐ ఆదాయాన్ని వందల కోట్లలో పెంచితే వారు మాత్రం తనకు ద్రోహం చేశారని ఆరోపిస్తున్నారు.
Follow Us