ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన వినేశ్ ఫొగాట్ .. కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అనర్హత వేటుకు గురైన సమయంలో ప్రధాని మోదీ నుంచి ఫోన్ వస్తే మాట్లాడేందుకు నిరాకరించానని పేర్కొన్నారు. '' ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌లో నాపై అనర్హత వేటు పడినప్పుడు ఆ సయమంలో ప్రధాని మోదీ నుంచి ఫోన్ వచ్చింది. కానీ నేను మాట్లాడేందుకు నిరాకరించాను. కాల్ నేరుగా నాకు రాలేదు. అక్కడ ఉన్న భారతీయ అధికారులు పీఎం మోదీ నాతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు. నేను మాట్లాడేందుకు సిద్ధంగానే ఉన్నప్పటికీ అధికారులు కొన్ని షరతులు పెట్టారు. నా టీమ్ నుంచి ఎవరినీ మాట్లాడవద్దని చెప్పారు. అలాగే ప్రధాని మోదీ వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియా సంభాషణను రికార్డ్ చేస్తారని తెలిపారు.
Also Read: ప్రతీరోజూ 50 కోట్లకు పైగా లావాదేవీలు..
నా కృషిని, భావోద్వేగాలను సోషల్ మీడియాలో ఎగతాళి చేసుకోవడం నాకు ఇష్టం అనిపించలేదు. మేము మాట్లాడే సంభాషణను ప్రచారం చేసే షరతు లేకుండా ప్రధాని నుంచి ఫోన్ వస్తే.. తప్పకుండా అభినందించేదాన్ని. ప్రధాని మోదీ నిజంగా క్రీడాకారుల గురించి శ్రద్ధ వహిస్తే.. రికార్డింగ్ చేయకుండానే కాల్ చేసేవారు. అప్పుడు ఆయనకు నేను కృతజ్ఞతాభావంతో ఉండేదాన్ని. నాతో మాట్లాడితే గత రెండేళ్ల విషయం గురించి అడుగుతానని పీఎం మోదీకి తెలిసి ఉండొచ్చు. అందుకే నావైపు నుంచి ఫోన్ ఉండకూడదని అధికారులు చెప్పారు. ఒకవేళ ఉంటే వారికి అనుకూలంగా ఎడిట్ చేసుకునేందుకు ఛాన్స్ ఉండదు. మామూలుగా మాట్లాడితే.. నేను ఒరిజినల్ కాల్‌ను బయటపెడతానని వారికి కూడా తెలుసని'' వినేశ్ ఫొగాట్ అన్నారు. అందుకే తాను మాట్లాడేందుకు నిరాకరించినట్లు చెప్పారు.
ఇదిలాఉండగా ప్యారిస్ ఒలింపిక్స్‌లోని రెజ్లింగ్ ఫైనల్ పోటీలో 100 గ్రాములు అధిక బరువు ఉండటంతో వినేశ్ అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆమె బంగారు పతకం దక్కించుకునే అవకాశం కోల్పోయింది. ఆ తర్వాత భారత్‌కు తిరిగివచ్చిన వినేశ్.. కాంగ్రెస్‌లో చేరారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె పార్టీ తరఫున జులానా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగింది. అయితే ఈ ఎన్నికల్లో ఆమె ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.