/rtv/media/media_files/2026/01/28/gold-2026-01-28-20-55-52.jpg)
బంగారం కొనాలని ప్లాన్స్ ఉన్నారా...అయితే విపరీతంగా పెరిగిన ధరలతో ఎలా కొనాలో అర్థం కావడం లేదా. అయితే కాస్త ఆగండి...ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ మీ ప్లాన్స్ ను వాయిదా వేసుకోండి. ప్రస్తుతం బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల వేళ మదుపరులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్న కారణంగా.. పసిడి ధర ఏకంగా ఎనిమిది వేల రూపాయులు పెరిగింది. దీంతో బంగారం ధర ప్రస్తుతం 1,62,380గా ఉంది.
బంగారంపై టాక్స్ తగ్గింపు..
అయితే వీటి ధరలు త్వరలోనే దిగి వస్తాయని చెబుతున్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో బంగారానికి సంబంధించి ఏడు కీలకమైన విధానపరమైన విస్తృత చర్యలు చేపడతారని అంచనాలు వెలువడుతున్నాయి. ఇవి కనుక కార్యరూపం దాల్చితే..పుత్తడి ధరలు దిగి వస్తాయని చెబుతున్నారు. వీటిల్లో ప్రధానంగా బంగారం, వెండి, రత్నాలు లాంటి ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశం ఉందని అంటున్నారు. భారత్ ఎక్కువగా బంగారం దిగుమతులపై ఆధారపడి ఉందని..అలాంటప్పుడు అధిక సుంకాలు దాని ధరలను పెంచుతాయని చెబుతున్నారు. అందుకే వీటిని తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు.
అలాగే కస్టమ్స్ ప్రక్రియలను కూడా సరళీకరిస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. భారత్ నుంచి బంగారం ఆభరణాలు ఎగుమతిలో కస్టమ్స్ ప్రక్రియల వలన విపరీతమైన జాప్యం జరుగుతోంది. వీటిని కనుక సవరిస్తే...పసిడి వ్యాపారం మరింత సులభతరం అవుతుంది. అప్పుడు భారత్ ప్రపంచ ఆభరణాల తయారీ కేంద్రంగా మారే అవకాశం ఉంటుంది. దీని వలన ధరలు కూడా దిగి వస్తాయని అంటున్నారు.
జీఎస్టీ సవరింపు..
బంగారంపై జీఎస్టీ కూడా అధికంగా ఉంది. ప్రస్తుతం బంగారంపై జీఎసటీ 3 శాతం ఉంది. దీనిని 1-1.25% కు తగ్గించాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. తక్కువ GST రేటు ఖర్చులను తగ్గిస్తుంది, అధికారిక కొనుగోళ్లను ప్రోత్సహిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే బంగారు ఆభరణాల కొనుగోళ్ళపై ఈఎమ్ఐ లాంటి సౌకర్యాలను ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. దీని వలన అధిక ధరలు ఉన్నప్పటికీ వినియోగదారులు సౌకర్యవంతంగా కొనుగోళ్ళు చేస్తారని చెబుతున్నారు. వీటితో పాటూ నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సమీకరిస్తే బావుంటుందని చెబుతున్నారు. ఇలా చేయడం వలన దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. ఇలా కూడా బంగారం ధరలను అదుపు చేయవచ్చని చెబుతున్నారు. అలాగే బంగారం ఆభరణాల తయారీలో మౌలిక సదుపాయాలను ఎక్కువ చేయడం, నైపుణ్యాభివృద్ధి, శిక్షణా కార్యక్రమాల వంటివి కూడా పసిడి ధరలను అందుబాటులోకి తెచ్చేందుకు సహాయపడతాయని అంటున్నారు. చివరగా, ప్రధాన విమానాశ్రయాలలో టూరిస్ట్ GST వాపసు పథకాన్ని త్వరగా అమలు చేయాలని పరిశ్రమ కోరుతోంది. ఇది విదేశీ పర్యాటకులు ఆభరణాల కొనుగోళ్లపై GST వాపసులను క్లెయిమ్ చేయడానికి వీలు కల్పిస్తుంది, విదేశీ మార్కెట్లలో కాకుండా భారతదేశంలో లగ్జరీ ఆభరణాలను కొనుగోలు చేయడానికి వారిని ప్రోత్సహిస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Follow Us