Pahalgam Attack: ప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో..ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?

చాలా ఏళ్ళ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు తెగబడి టూరిస్టులను చంపేశారు. ప్రధాని విదేశీ పర్యటనలో ఉండగా..అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ లో ఉండగా ఘటన జరిగింది.. దీంతో ఇరు దేశాలను టార్గెట్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

author-image
By Manogna alamuru
New Update
J&K Terror Attack

J&K Terror Attack

 జమ్మూ కాశ్మీర్ లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అతి పెద్ద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఒక ఇటాలియన్, మరొక ఇజ్రాయెల్ వ్యక్తితో పాటూ 24 మంది భారతీయులు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడిన వారు ఉన్నారు. మృతుల స:క్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.  పహల్గామ్ లో పర్యటనకు వచ్చిన వారిపై మిలటరీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూక కాల్పులు జరిపింది. ఏం జరుగుతుందో తెలిసే లోపు ప్రాణాలు పొట్టబెట్టుకున్నారు. భార్యల ఎదుటే భర్తలను, పిల్లల ఎదుటే తల్లిదండ్రులను చంపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడికి తామే బాధ్యులమని లష్కరే తోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ప్రకటించింది. దాడి చేసిన ఉగ్రవాదులు ఇంకా కొంత మంది అదే ప్రదేశంలో ఉన్నట్టు తెలుస్తోంది. వారిని పట్టుకోవడానికి భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు పహల్గామ్ కు ఎన్ఐఏ బృందం ఈరోజు చేరుకోనుంది. 

మోదీ అక్కడ, జేడీ వాన్స్ ఇక్కడ..

రెండు రోజుల క్రితమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియా వచ్చారు. సోమవారం వాన్స్ ను కలిసిన ప్రధాని మంగళవారం సౌదీ పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు మాత్రం ఇంకా భారత్ లోనే ఉన్నారు. మంగళవారం ప్రధాని మోదీ సౌదీ చేరుకున్నాక..సమయం చూసి మరీ పహల్గామ్ లో టెర్రరిస్టులు దాడులకు తెగబడ్డారు. ఈ మొత్తం పరిస్థితి చూస్తుంటే..టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారని అనిపిస్తోంది. ప్రధాని మోదీ దేశంలో లేని సమయంలోనే దాడులకు తెగబడాలని వారు ప్లాన్ చేసినట్లు తెలుస్తోందని..అధికారులు అంటున్నారు. అది కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ లో ఉండగా...కావాలనే చేశారని చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికే జేడీ వాన్స్ ఇండియా వచ్చినప్పుడు ఉగ్రవాదులు దాడి చేశారని అంటున్నారు. 2000 మార్చి 20న ఇలాగే అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ న్యూ ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అనంత్‌నాగ్‌ జిల్లాలో ఛత్తీసింగ్‌పొరలో ఉగ్రవాదులు 36 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకొన్నారు.  సిక్కువర్గంలోని వారిని ఏరి మరీ ఉగ్రమూక చంపేశారు. అప్పుడు కూడా భారీ తుపాకులు, రెండు సైనిక వాహనాల్లో వచ్చి తాము సైనికులమని చెప్పుకుంటూ పురుషులను గురుద్వారా దగ్గరకు రావాలని ఆదేశించారు. ఆ తర్వాత వారందరినీ హతమార్చారు. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన సందర్భంగా మరోసారి ఉగ్రవాదులు దాడులు చేశారు. 

కాశ్మీర్ లో ఆధిపత్యం..

జమ్మూ, కాశ్మీర్ కొన్ని ఏళ్ళుగా ప్రశాంతంగా ఉంటోంది. ఇక్కడ ఉగ్ర కార్యకలాపాలు చాలానే తగ్గాయి. పుల్వామా దాడి తర్వాత ఇక్కడ పెద్దగా దాడులు జరగలేదు. ఒకవేళ జరిగినా ఆర్మ మీద జరిగాయే తప్ప..సాధారణ పౌరుల జోలకి రాలేదు. దాదాపు ఇరవై ఏళ్లుగా ఇక్కడ ప్రజలు ప్రశాంతంగానే బతుకుతున్నారని చెప్పవచ్చును. ఈ నేపథ్యంలో జమ్మూ, కాశ్మీర్ లో పర్యాటకం బాగా పెరిగింది. గత రెండు, మూడేళ్ళుగా బాగా ఎక్కువైంది. అదీ కాక ఈ మధ్యనే ఎల్వోసీ ప్రాంతాల్లో కూడా పర్యటన చేయొచ్చని అనుమతి ఇచ్చారు. దాడి జరిగిన దాన్ని బట్టి చూస్తే వీటన్నింటినీ ఉగ్రమూకలు నిశితంగా గమనిస్తున్నాయి. దాంతో పాటూ 2019లో 370 ఆర్టికల్ ను కూడా రద్దు చేశారు. దీని మీద కూడా టెర్రరిస్టులు, పాకిస్తాన్ గుర్రుగానే ఉన్నాయి. అందుకే పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భద్రతాదళాలు భావిస్తున్నాయి. కాశ్మీర్ ను తమ గుప్పెట్లోనే ఉంచుకోవాలనే ఆలోచనతోనే ఇలా చేశారని అనుమానిస్తున్నారు. 

ముంబై 26/11 తరహాలో..

ఆర్మీ యూనిఫాంలో వచ్చి, మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. దొరికినవాళ్లను దొరికినట్లు పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపేశారు. 26 మంది అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల నుంచి తప్పించుకుని వచ్చిన మిగతా టూరిస్టుల ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా దద్ధరిల్లుతోంది. సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. కాల్పుల  అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు.  2017 తర్వాత టూరిస్టులపై జమ్మూ కాశ్మీర్​లో దాడి జరగడం ఇదే మొదటిసారి. 2019లో ఆర్టికల్​ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి కూడా ఇదే. అది కూడా అచ్చంగా 26/11 ముంబై దాడుల తరహాలో ప్లాన్ చేశారని భద్రతా బలగాలు అంటున్నాయి.  నలుగురైదుగురు టెర్రరిస్టులు ఆర్మీ, పోలీస్​ యూనిఫామ్​ ధరించి.. ముఖాలకు మాస్కులు పెట్టుకొని, తుపాకులతో టూరిస్టులున్న ప్రాంతానికి వచ్చారు. మీది ఏ మతం అని అడిగి మరీ  ప్రాణాలు తీశారు. మరి కొందరు రిస్టులతో ప్రార్థనలు చేయించి.. కాల్చి చంపారు. ముంబైలో దాడి జరిగినప్పుడు కూడా టెర్రరిస్టులు ఇదే ఇలానే ఉన్నట్టుండి మీద పడి మరీ చంపారు. ఇప్పుడు జరిగిన సంఘటన దాన్నే గుర్తుకు తెచ్చిందని అంటున్నారు. 

today-latest-news-in-telugu | jd-vance | terrorist-attack | Pahalgam attack

Also Read: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు