Supreme Court: పిల్లల లైంగిక సమ్మతి కేసులో సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

లైంగిక సంబంధాలకు సమ్మతి వయస్సు 18 నుంచి16 ఏళ్లకు తగ్గించాలన్న వాదనను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తీవ్రంగా వ్యతిరేకించింది. సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ చేసిన వాదనకు స్పందనగా ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది.

New Update
Supreme Court 3

భారతీయ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. లైంగిక సంబంధాలకు సమ్మతి వయస్సు 18 నుంచి16 ఏళ్లకు తగ్గించాలన్న వాదనను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తీవ్రంగా వ్యతిరేకించింది. సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ చేసిన వాదనకు స్పందనగా ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది. ఈ వయస్సును తగ్గిస్తే పిల్లల రక్షణ కోసం చేసిన చట్టాలు బలహీనపడతాయని, లైంగిక వేధింపులు, బాలల అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. పిల్లల లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POCSO) ప్రకారం సమ్మతి వయస్సును 18 ఏళ్లుగానే కొనసాగించాలని స్పష్టం చేసింది.

కేంద్ర వాదనలు

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఒక అఫిడవిట్‌లో కేంద్రం తన వాదనలను వివరించింది. భారత రాజ్యాంగం ప్రకారం, 18 ఏళ్ల లోపు వారందరినీ మైనర్లుగా పరిగణించి, లైంగిక దోపిడీ నుంచి వారిని రక్షించడం చట్టాల ప్రాథమిక లక్ష్యం. సమ్మతి వయస్సును తగ్గించడం అంటే ఈ రక్షణ కవచాన్ని తొలగించడమే అవుతుంది. టీనేజర్ల మధ్య ఉండే 'ప్రేమ సంబంధాల' పేరుతో సమ్మతి వయస్సును తగ్గించడం సరైన చర్య కాదని కేంద్రం తెలిపింది. అలాంటి మార్పులు, ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్న పిల్లలు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొంది.

పోక్సో చట్టం 2012లో తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశ్యం, పిల్లలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టడం. సమ్మతి వయస్సును తగ్గించడం అనేది ఈ చట్టం లక్ష్యానికి విరుద్ధంగా ఉంటుంది. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2007లో నిర్వహించిన అధ్యయనాన్ని కేంద్రం ఈ సందర్భంగా సమార్పించింది. ఆ అధ్యయనం ప్రకారం, భారతదేశంలో 53.2% మంది పిల్లలు ఏదో ఒక రకమైన లైంగిక వేధింపులకు గురవుతున్నారని, వారిలో 50% మంది కుటుంబ సభ్యులు, బంధువులు, లేదా టీచర్లు వంటి నమ్మకస్తుల చేతే వేధింపులకు గురవుతున్నారని వెల్లడించింది.

 అలాగే16 నుంచి18 ఏళ్ల వయసు వారి మధ్య ఉండే సంబంధాలను నేరంగా పరిగణించకుండా, న్యాయస్థానాలు ప్రతి కేసును దాని పరిస్థితుల ఆధారంగా విచక్షణతో వ్యవహరించాలని కేంద్రం సూచించింది. అయితే, చట్టంలో దీనికి మినహాయింపులు చేర్చడం మాత్రం ప్రమాదకరమని స్పష్టం చేసింది. గత కొంతకాలంగా, పోక్సో చట్టం దుర్వినియోగం అవుతోందని, టీనేజ్ ప్రేమ సంబంధాలను నేరంగా పరిగణిస్తున్నారని కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. కేంద్రం తాజాగా ఇచ్చిన ఈ ప్రకటనతో లైంగిక సంబంధాలకు అంగీకారం వయస్సు 18 ఏళ్లుగా కొనసాగించడంపై ప్రభుత్వం వైఖరి స్పష్టమైంది.