/rtv/media/media_files/2025/02/10/rTD3kRrn1eINvnMhmjCl.jpg)
Supreme Court
Katta Ramchandra Reddy : ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు కట్టా రామచంద్రా రెడ్డి తో పాటు కడారి సత్యానారాయణ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపిస్తూ కట్టా రామచంద్రా రెడ్డి కుమారుడు రవిచంద్ర, కూతురు స్నేహ ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు రామచంద్రా రెడ్డి డెడ్‌బాడీనీ మార్చురీలో భద్రపరచాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయదశమి సెలవుల నేపథ్యంలో తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. దసరా సెలవుల నేపథ్యంలో తక్షణ విచారణ చేపట్టే అవకాశం లేకపోవడంతో తన తండ్రి మృతదేహానికి రీపోస్టు మార్టం చేయాలని, అప్పటివరకు దహనం చేయకూడదని ఆయన కుమారుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
రామచంద్రా రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు ఆయనను పట్టుకుని చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత కాల్చి చంపారని వారు న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ మేరకు వారి పిటిషన్‌పై స్పందించిన జస్టిస్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ కోటీశ్వర సింగ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఈ విషయంపై నిర్ణయం తీసుకునే వరకు రామచంద్రా రెడ్డి డెడ్‌బాడీని సంరక్షించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా పిటిషనర్ వేసిన పిటిషన్‌పై విచారణకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది. మెరిట్స్‌పై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా అన్ని వాదనలను బహిరంగంగా ఉంచుతున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
ఈ విచారణపై పిటిషనర్ తరఫు న్యాయవాది కోలిన్ గోన్సాల్వెస్ మాట్లాడుతూ.. తన క్లయింట్ రామచంద్రా రెడ్డిది బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. అయితే, అత్యవసర విచారణకు అక్కడి కోర్టులో అనుమతి లభించలేదని, ఈ సమయంలో తన క్లయింట్ తండ్రి మృతదేహాన్ని పోలీసులు దహనం చేసే అవకాశం ఉందన్న భయంతోనే సుప్రీకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ధర్మాసనానికి తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి చెందని బయటి అధికారులు చేసిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని ఆయన తెలిపారు.
చత్తీస్‌గఢ్ రాష్ట్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ పోస్ట్‌మార్టం వీడియోగ్రఫీలో నిర్వహించబడిందని తెలిపారు. ఈ ఫైరింగ్‌లో ఇద్దరు వ్యక్తులు మరణించారని ఆయన గుర్తు చేశారు. మావోయిస్టు రామచంద్రా రెడ్డి డెడ్‌బాడీని వారి కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కానీ వారి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారని తెలిపారు. మృతుడు మావోయిస్టు పార్టీ కమాండర్ అని ఏడు రాష్ట్రాల్లో ఆయనపై రూ.2 కోట్ల రివార్డు ఉందని గుర్తు చేశారు. కానీ, ప్రతివాదులు డెడ్‌బాడీని మాయం చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పగా.. జస్టిస్ సూర్యకాంత్ కలుగజేసుకుని ‘వద్దు పర్వాలేదు.. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తమకు తెలుసని కామెంట్ చేయడం గమనార్హం.
ఇది కూడా చదవండి: మనసును కలచివేసే ఘటన... అనంతపురంలో వేడి పాల గిన్నెలో పడి బాలిక మృతి